ఇంపార్టెంట్‌ టాపిక్‌: రజనీకాంత్‌ అలాగనేశాడేంటీ.!

తమిళనాట ‘మెర్సల్‌’ సినిమా వివాదాల్లోకెక్కడం తెల్సిన విషయమే. వైద్య రంగంలో అక్రమాలపై ‘మెర్సల్‌’ సినిమాలో కడిగి పారేశారు. అంతేనా, జీఎస్‌టీ దేశమ్మీద దండెత్తడంపైనా దుమ్మెత్తి పోసేశారు. అందుకేనేమో, బీజేపీకి ఒళ్ళు మండిపోయింది. సినిమాని బ్యాన్‌ చేసెయ్యాలంటూ కమలనాథులు ‘ఫత్వా’ జారీ చేసేయడం, నిర్మాత దిగొచ్చి ‘ఆ సన్నివేశాల్ని, డైలాగుల్ని తీసేస్తాం..’ అని ప్రకటించడం జరిగిపోయాయి.

అంతకు ముందే కమల్‌హాసన్‌, ‘మెర్సల్‌’ సినిమాకి ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చాడు. ‘సినిమాకి ఇంకో సెన్సార్‌ అవసరం లేదు..’ అంటూ బీజేపీ నేతల రాద్ధాంతంపై సెటైర్‌ వేసిన విషయం విదితమే. ఇంతకీ, రజనీకాంత్‌ ఎక్కడ.? తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, ఓ సినిమాపై జరుగుతున్న రాజకీయ దాడిపై స్పందించకపోవడమేంటి.? అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఓహో, బీజేపీకి రజనీకాంత్‌ సపోర్ట్‌ కదా..’ అంటూ సెటైర్లు కూడా పడ్డాయి.

అటు తిరిగి, ఇటు తిరిగి వివాదం తన మీద పడేసరికి, రజనీకాంత్‌ కంగారుపడినట్టున్నాడు. ‘మెర్సల్‌’ సినిమా బాగుందనీ, ‘ఇంపార్టెంట్‌ టాపిక్‌’ని అడ్రస్‌ చేశారనీ సోషల్‌ మీడియాలో రజనీకాంత్‌ స్పందించాడు. దాంతో, మళ్ళీ సెటైర్లు షురూ అయ్యాయి. ‘రజనీకాంత్‌కి ఇప్పుడే తెల్లారినట్టుంది.. అదీ నిర్మాత డైలాగుల్ని, సన్నివేశాల్ని తొలగిస్తానని చెప్పాక రజనీకాంత్‌ స్పందించడం శోచనీయం..’ అంటూ నెటిజన్లు మళ్ళీ రగడ షురూ చేసేశారు.

మరోపక్క, రజనీకాంత్‌ అభిమానులు మాత్రం ‘2.0’ పనుల్లో బిజీగా వుండడం వల్లే రజనీకాంత్‌ ‘మెర్సల్‌’ సినిమా చూడలేకపోయారనీ, సినిమా చూసి స్పందించినందుకు సంతోషించాలని అంటున్నారు.

అయినా, నరేంద్రమోడీ సర్కార్‌కి నచ్చని విషయాలపై రజనీకాంత్‌ పాజిటివ్‌గా స్పందించడం ఏంటట.? మోడీకి రజనీకాంత్‌పై కోపం వచ్చేయదూ.!


Recent Random Post: