ఉత్సాహం మంచిదే… మరీ ఇంతగానా?

సామాన్యులకైనా, రాజకీయ నాయకులకైనా ఉత్సాహం ఉండాల్సిందే. హుషారు కావల్సిందే. కాని అది ‘అతి’ అయితే అభాసుపాలు కావల్సివస్తుంది. ఉత్సాహపడటానికి కూడా అర్థం పరమార్థం ఉండాలి. కాని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణకు ఉత్సాహం ఎక్కువైపోయి అవధులు దాటుతోంది. రేవంత్‌ రెడ్డి ఎపిసోడ్‌ జరిగినన్ని రోజులు చికాకుగా, ఆగ్రహంగా ఉన్న రమణ అధినేత చంద్రబాబు వచ్చి సమావేశం పెట్టి ‘ఉన్నానని నేనున్నానని, నీకేంకాదని’ అని పాడేసిన తరువాత వెయ్యేనుగుల బలం వచ్చిన ఫీలింగ్‌ కలిగింది.

ఆ ఫీలింగ్‌లో రాష్ట్రంలో టీడీపీ బలాన్ని అతిగా ఊహించుకొని గొప్పలు చెబుతున్నారు. పార్టీ ఉనికి నిలబడితే చాలని చంద్రబాబు భావిస్తుండగా, ‘వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీపై టీడీపీ జెండా ఎగరేస్తాం’ అని రమణ అన్నారు. ‘అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను పేదల ఆస్పత్రిగా మారుస్తాం’ అన్నారు. ఇది అత్యుత్సాహమే కదా.

‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది రమణ వైఖరి. అధికారంలోకి రావాలనుకోవడం తప్పు కాదు. కాని దానికి ప్రాతిపదిక చూపించాలి కదా. తెలంగాణలో టీడీపీ నుంచి నాయకులు పోయినా ఏం కాదని, కేడర్‌ చెక్కుచెదరలేదని తరచుగా అనే మాట. అది ఎంత బలంగా ఉందో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక జరిగిన వివిధ ఎన్నికల్లో చూశాం.

ఆ లెక్కన చూస్తే కమ్యూనిస్టు పార్టీలకు మస్తు కేడర్‌ ఉంది. ఉద్యమాల్లో ఉరుకులు పెట్టుకుంటూ వస్తారు. కాని ఓట్లు పడవు. సీట్లు రావు. తాము అధికారంలోకి వస్తామని చెప్పుకునే పరిస్థితి అసలు లేదు. కేసీఆర్‌ వైఫల్యాలు చాలా ఉన్నాయి. అనేక హామీలు కార్యరూపం దాల్చలేదు. అయినప్పటికీ ప్రజలు ఇంకా టీఆర్‌ఎస్‌ను దూరం పెట్టే పరిస్థితి రాలేదు.

కొడంగల్‌లో ఉప ఎన్నిక వస్తే సత్తా చూపిస్తామని రమణ అన్నారు. కాని సాధ్యం కాదు. తెలంగాణలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో నిర్ణయం కాలేదు. అధినేత చంద్రబాబు ఏమనుకుంటున్నారో తెలియదు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెసుతో, మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోవాలన్నప్పుడు పొత్తుల గురించి ఎవ్వరూ మాట్లాడవద్దని, ఎన్నికల సమయంలో చర్చిద్దామని అన్నారు. ఇంత స్పష్టంగా చెప్పిన తరువాత కూడా రమణ వచ్చే ఎన్నికల్లో టీడీపీ భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటామన్నారు. ఇది ఓకే. కాని దీనివెంటనే ‘మొత్తం 119 స్థానాలకూ అభ్యర్థులను నిలబెడతాం’ అని చెప్పారు. ఇదెలా సాధ్యం?

పొత్తయినా పెట్టుకోవాలి. ఒంటరిగానైనా పోటీ చేయాలి. కాని రమణ రెండు పనులూ చేస్తామంటున్నారు. పొత్తు పెట్టుకున్నప్పుడు అవతలి పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వాలి కదా. అలాంటప్పుడు మొత్తం స్థానాలకు పోటీచేయడం సాధ్యం కాదు కదా. కాని రమణ లాజిక్‌ లేకుండా మాట్లాడారు. ఇప్పుడు అసెంబ్లీపై జెండా ఎగరేస్తామని చెప్పిందాంట్లోనూ లాజిక్‌ లేదు.

టీడీపీ విస్తృత సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ఏం చెప్పకుండా చేసేదే రాజకీయమన్నారు. రమణ మాదిరిగా అతిగా మాట్లాడితే రాజకీయం ఎలా అవుతుంది? ఇక తెలంగాణలో ఎలా ఆట ఆడాలో, ఏం చేయాలో తనకు తెలుసని బాబు చెప్పారు. తాను తయారుచేసే ప్లాన్లు ఫాలో అయితే చాలన్నారు. తెలంగాణ టీడీపీని నడిపించే బాధ్యత ఆయనే తీసుకున్నారు కాబట్టి ఆయన మనసులో ఏముందో ఎన్నికల ముందు బయటకు వస్తుందేమో.


Recent Random Post: