
ఎర్ర సినిమాల స్పెషలిస్ట్.. అదేనండీ విప్లవ కథా చిత్రాల స్పెషలిస్ట్ ఆర్.నారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే, జనాభాని పెంచాలని క్లాసులు తీసుకుంటున్నారు. ‘జనాభా పెంచకపోతే ఎలా.? దయచేసి పిల్లల్ని కనండి.. జనాభాని పెంచండి.. జనాభా లేకపోతే హిందుస్తాన్ ఎక్కడ.?’ అంటూ తన ట్రేడ్ మార్క్ ఆవేశంతో ఊగిపోయారు ఆర్.నారాయణమూర్తి.
రామినేని సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పురస్కారాల వేడుకలో ఆర్.నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడే అదే వేదికపై వున్న చంద్రబాబు కూడా, పిల్లల్ని కనకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా భవిష్యత్తులో జపాన్‌లా తయారవుతుందనీ, ముసలివాళ్ళు తప్ప, యువతీ యువకులు కన్పించరనీ చంద్రబాబు చెప్పుకొచ్చారు. నిజానికి, ఈ తరహా వాదనలు చంద్రబాబు 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ చెబుతూనే వున్నారు.
ఒకప్పటి పరిస్థితి వేరు. కుటుంబ నియంత్రణ దిశగా ప్రభుత్వాలు చాలా ప్రచారమే చేపట్టాయి. ‘ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. మూడోది వద్దే వద్దు..’ అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం హోరెత్తించారు కుటుంబ నియంత్రణపైన. జనాభాలో, భారతదేశం ఏకంగా చైనాతో పోటీ పడ్తోందిప్పుడు. కొన్నాళ్ళలో చైనాని మించిపోయే పరిస్థితుల్లో వున్నాం. అయినా, జనాభా పెంచాలని చంద్రబాబు, విప్లవ చిత్రాల కథనాయకుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి చెబుతుండడం విశేషమే మరి.
చంద్రబాబు సంగతి సరే.. ఆర్.నారాయణమూర్తికి ఏమయ్యింది.? అదే కదా మరి వింత అంటే.!
Recent Random Post:

















