ఏపీకోసం అదనపు భారానికి కేంద్రం సై అంటుందా?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో కేంద్రం సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని ఎవరికైనా అనిపిస్తే అది అతిశయోక్తి కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా వారు రాష్ట్రంపై ప్రదర్శించిన ప్రేమాభిమానాలు అన్నీ ఉత్తుత్తివే అని ఆచరణలో కనిపిస్తూనే ఉంది. ఏదో వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉండగా.. తన వాటాగా ఏపీ కి కొంత అదనపు లబ్ధి చేశారే తప్ప.. మోడీ సర్కారు ఈ అనాథ రాష్ట్రం కోసం చేసిన సాయం ఏమీ లేదు.

ఆ మాటకొస్తే.. విభజన చట్టం అనుసరించి గానీ, కొత్త రాష్ట్రానికి అందించాల్సిన సాయం పరంగా గానీ… కేంద్రం మీద ఉండే ప్రాథమిక బాధ్యతలనే వారు సరిగా పట్టించుకోవడం లేదు. ప్రాథమికంగా వారు అందించాల్సిన చేయూతనే అప్పుడప్పుడూ ముష్టి తరహాలో విదిలిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ వైఫల్యాల వల్ల ఎదురుకాగల అదనపు భారం (అది కూడా వేల కోట్ల రూపాయలలో) కూడా కలిపి వారి ముందు ప్రతిపాదనలు పెడితే అంగీకరిస్తారా? ఇదే ఇప్పుడు అమరావతి అధికార వర్గాల్లో సందేహంగా, గుబులుగా వ్యక్తం అవుతోంది.

పోలవరం ప్రాజెక్టు విషయంలో.. ఆద్యంతమూ ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలు అవుతున్నాయి. ఒకప్పట్లో కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ కు అనుకూలంగా అంచనాలు సవరించి, చంద్రబాబు సర్కారు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు, రాష్ట్రం కేవలం పనుల నిర్వహణ కన్సల్టెంటు వంటి పాత్రను మాత్రమే పోషిస్తున్నప్పుడు తమ అనుమతులు లేకుండా అంచనాలు ఎలా సవరించారంటూ ఇంకా పంచాయతీ నడుస్తూనే ఉంది. సవరించిన అంచనాల మేరకు నిధులు ఇవ్వాలా వద్దా అనేది కేంద్రం ఇంకా నిర్ణయించనేలేదు.

పరిస్థితులు ఇలా ఉండగా.. ట్రాన్స్ ట్రాయ్ పనులు చేయలేకపోతోందని వారిని తప్పించి.. కొత్తగా టెండర్లు పిలవడానికి చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. కొత్తగా టెండర్లు పిలవడం అంటే.. వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. భారీగా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ భారానికి కేంద్రం అంగీకరిస్తుందా? అనేదే ప్రభుత్వ మీమాంస.

ముందుగా కేంద్రం అనుమతి తీసుకుని.. ఆ తర్వాత టెండర్లు పిలిస్తే చిక్కులు ఉండవని అనుకుంటున్నారు గానీ.. కొత్త టెండర్ల వలన పడగల అదనపు భారాన్ని మోయడానికి కేంద్రం ఒప్పుకోకపోవచ్చునని, రాష్ట్రప్రభుత్వ వైఫల్యంగా గుర్తించి ఆ భారాన్ని రాష్ట్రమే భరించాలని చెబుతారేమోనని పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదనపు భారాన్ని మోయానికి కేంద్రం సంసిద్ధత తెలిపేంత ప్రేమానుబంధాలు అటు చంద్రబాబుతో గానీ, ఏపీ మీద గానీ కేంద్రం కలిగి ఉన్నదా లేదా అనే దానిపై ఈ పరిణామాలు ఆధారపడి ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


Recent Random Post: