
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎలా చనిపోయారు? గుండెపోటుతో చనిపోయారు. ఇప్పటివరకు ప్రజలకు తెలిసింది ఇదొక్కటే. ఈ విషయం ఆమె చికిత్స పొందిన అపోలో ఆస్పత్రి ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెబితే తెలిసింది. కాని జయలలితకు ఏం అనారోగ్యం కలిగింది? ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమె అరోగ్య పరిస్థితి ఏమిటి? 75 రోజులపాటు ఆస్పత్రిలో ఏ జబ్బుకు, ఏం చికిత్సలు చేశారు?… ఇలాంటి చాలా విషయాలు ప్రజలకు తెలియవు.ప్రస్తుతం జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ విచారణ తరువాత ఇచ్చే నివేదిక ప్రభుత్వం బయటపెడితేనే అసలు విషయాలు తెలుస్తాయి. కమిషన్ ముందు హాజరైనవారు వారికి తెలిసిన విషయాలు చెప్పారు. ఏవో ఆధారాలు ఇచ్చారు.
ఇవన్నీ ఒకెత్తు అయితే జయలలిత చికిత్స పొందిన అపోలో ఆస్పత్రి వైద్యులు కమిషన్‌కు సమర్పించిన మెడికల్ డాక్యుమెంట్లు అత్యంత ప్రధానమైనవి. ఇవన్నీ కమిషన్‌కు సమర్పించామని అస్పత్రి ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మీడియాకు చెప్పారు. ఈ రోజుల్లో ఏ కేసు విచారణకైనా సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను కీలకంగా పరిగణిస్తున్నారు.విచారణ కమిషన్లుగాని, కోర్టులుగాని సీసీ ఫుటేజీలు సమర్పించాలని అడుగుతున్నాయి. కాని జయలలిత కేసులో అవే లేవు. చిన్నచిన్న కిరాణ కొట్లలోనే సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకమైన అపోలోలో లేకుండా ఉండవు కదా. కాని అప్పటి పన్నీరుశెల్వం ప్రభుత్వమో, పార్టీ నాయకులోగాని జయలలితను ఉంచిన ఇంటెన్సివ్ కేర్‌లోని మొత్తం సీసీ కెమెరాలను 75రోజులపాటు స్విచాఫ్ చేశారు. ఈ విషయాన్ని ఈరోజు ప్రతాప్ రెడ్డే మీడియాకు చెప్పారు.
సీసీ ఫుటేజ్ గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు, ‘దురదృష్టవశాత్తూ వారు (పార్టీ నాయకులా? ప్రభుత్వ అధికారులా?) 75రోజులపాటు సీసీ కెమెరాలను స్విచాఫ్ చేశారు’ అని చెప్పారు. నిబంధనల ప్రకారం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి ఎవ్వరినీ అనుమతించలేదన్నారు. సో… అస్పత్రిలో ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలంటే ఆధారాలు లేవు. కేవలం మెడికల్ డాక్యుమెంట్లను పరిశీలించాల్సిందే. జయలలిత మరణం విషయంలో ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడటం బహుశా ఇది రెండోసారి. జయలలిత కన్నుమూసి నెల రోజులైన తరువాతఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలితకు గుండెపోటు వస్తుందని ఊహించలేకపోయామన్నారు.
మధ్యలో రెండు రోజులు తప్ప తాను రెండు నెలలపాటు చెన్నయ్ వదిలి వెళ్లలేదని, జయకు జరిగిన అన్ని చికిత్సలను దగ్గరుండి పర్యవేక్షించానని చెప్పారు. వైద్యానికి సంబంధించిన పలు విషయాలు వివరించారు. కాని ఆమెకు కలిగిన అనారోగ్యం ఏమిటి? ఏ జబ్బుకు చికిత్స చేశారు? ఆమె అనారోగ్యం వివరాలు ఎందుకు బయటకు చెప్పలేదు? ఆమె కోలుకుందని, ఇష్టమొచ్చినప్పుడు ఇంటికి వెళ్లవచ్చునని చెప్పాక కూడా ఫోటోలు ఎందుకు విడుదల చేయలేదు? ఆమెను చూడటానికి ప్రముఖులను కూడా ఎందుకు అనుమతించలేదు?… ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు చెప్పలేదు. మళ్లీ ఇంత కాలానికి సీసీ ఫుటేజీలు లేవనే వాస్తవం బయటపెట్టారు. జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై దర్యాప్తు చేయాలని మద్రాసు హైకోర్టులో, సుప్రీం కోర్టులో అప్పట్లో పిటిషన్లు దాఖలయ్యాయి. కొన్ని ఆంగ్ల పత్రికలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు ప్రచురించాయి.
గతంలో డీఎంకే అధినేత కరుణానిధి (93) అనారోగ్యం పాలై కావేరి ఆస్పత్రిలో చేరారు. ఆయన వాడుతున్న మందుల సైడ్‌ఎఫెక్స్ట్ కారణంగా అనారోగ్యం కలిగింది. చికిత్స తరువాత ఆయన కోలుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఆయన టీవీ చూస్తున్న, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. జయలలిత కోలుకున్నారని, ఇంటికి కూడా వెళ్లొచ్చని ప్రతాప్ రెడ్డి ప్రకటించాక కూడా ఫొటోలు విడుదల చేయలేదు.తన ఫొటోలు మీడియాకు విడుదల చేయాలని జయలలిత చెప్పారని, కాని ఆమె ఫ్రెండు శశికళ నటరాజన్ వద్దని ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పారని మీడియాలో వార్తలొచ్చాయి. దీన్నిబట్టి చూస్తే ఆమె మరణం వెనక ఏదో మిస్టరీ ఉందని జనం అనుకున్నారు. అదేమిటో కమిషన్ బయటపెడుతుందా?
Recent Random Post:

















