కేకులు కట్ చేసేది ఒకరు… మీటింగుకు వచ్చేది ఒకరు!

విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో అసలు ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశంలోనే తేటతెల్లం అయిపోయింది. ప్రభుత్వం సమీక్ష తర్వాత.. ఆత్మహత్యలను అరికట్టడానికి తాము ఏదేదో చేసేస్తున్నట్లుగా ఎన్ని ప్రకటనలైనా చేయవచ్చుగానీ.. చంద్రబాబునాయుడు.. తాను నెలకోసారి సమీక్షించేస్తున్నానంటూ తనకు అలవాటు అయిన పడికట్టు పదాలను వల్లించవచ్చు గానీ.. వాస్తవంలో ఇంత నిష్ప్రయోజనమైన సమీక్ష సమావేశం మరొకటి లేదనే వాదన వినిపిస్తోంది.

ఆత్మహత్యలు జరుగుతున్నది మొత్తం నారాయణ, శ్రీచైతన్య కళాశాలలో మాత్రమే. అయితే సీఎం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆ రెండు సంస్థల నుంచి కీలక బాధ్యులు వచ్చారా అంటే అనుమానమే. ఎవరో వారి తరఫున ప్రతినిధులు లాగా మొక్కుబడి వ్యక్తులు మాత్రమే వచ్చారు. నిజంగా సంస్థకు యాజమాన్యం హోదాలో ఉండి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే వారి కళాశాలలన్నీ పరిమితమైన సంఖ్యతో.. సుఖంగా నడుస్తున్న సంస్థలు. అసలు పిల్లలను పొట్టన పెట్టుకుంటున్న నారాయణ, శ్రీచైతన్య సంస్థల విషయంలో ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉన్నదో దీనిని బట్టే అర్థమవుతోంది.

పరీక్ష ఫలితాల ర్యాంకులు వచ్చినప్పుడు, చైతన్య, నారాయణ సంస్థలు ఎడాపెడా టీవీ ప్రకటనలు ఇస్తుంటాయి. కేకులు కత్తిరించి.. తాము వీడియోలు దిగి గంటల కొద్దీ టీవీ ఛానెళ్లలో ప్రసారాలు అయ్యేలా చూసుకుంటూ ఉంటారు. అలా ఫలితాలు వచ్చినప్పుడు పిల్లలతో కలిసి ఫోటోలు దిగుతున్న వాళ్లెవరు? తమ సంస్థ సాధించిన విజయాల కింద వాటిని టముకు వేసుకుంటూ.. కేకులు కట్ చేసి ఛానెళ్లలో మురిసిపోతూ ప్రసంగాలు దంచుతున్నది ఎవరు? అలాంటి అసలు వ్యక్తులు పిల్లలను బలిచేస్తున్న వ్యవహారంపై మాట్లాడడానికి సమీక్ష సమావేశానికి వచ్చారా? అంటే లేనే లేదు. మరి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి వారికి కూడా అంత లెక్కలేని తనం ఉన్నదంటే ఎలా అర్థం చేసుకోవాలి.

చంద్రబాబునాయుడు కూడా ఏదో చేసేస్తాం.. ఆపేస్తాం అంటే కుదర్దు. కొన్ని నిబంధనలు విధించారు. కొన్ని పద్ధతులు పాటించాల్సిందిగా చెబుతున్నారు. అంతా బాగానే ఉంది. మరి వాటిని తను నెలకోసారి సమీక్షిస్తా అంటున్నారు. ఆ కమిటీలతో మాట్లాడతా అంటున్నారు. ఆయన కమిటీలతో మాట్లాడడం ఎవరికి కావాలి? నెలకోసారి ఆయన స్వయంగా పిల్లలతో మాట్లాడితే.. అప్పుడు తెలుస్తుంది అసలు ఆయా కాలేజీల అసలు బాగోతం ఏమిటో? ఏదో ర్యాంకులు వచ్చిన పిల్లలకు ప్రతిభ అవార్డులు ఇచ్చేసి.. వారితో వేదిక మీద ముచ్చట్లు చెప్పడం కాదు. కాలేజీల్లో నరకం అనుభవిస్తున్న.. ఆ కాలేజీల కంటె చావు మేలని అనుకుంటున్న పిల్లలతో వ్యక్తిగతంగా… ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు మాట్లాడితే.. ఎన్ని రకాల హింసలు అక్కడ తాండవిస్తున్నాయో అర్థం అవుతుంది.

ర్యాంకుల వేటలో పిల్లల్ని బలిపశువులు చేస్తున్న దుర్మార్గులు ఎవరో కూడా తేలుతుంది. అసలు దుర్మార్గుల మీద హత్య కేసులు పెట్టేలా చట్టాల్ని కఠినతరం చేస్తే వారి కక్కుర్తి ఆగుతుంది. ఆత్మహత్యలు నివారించడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం మానేసి.. అదేదో జిందా తిలిస్మాత్ అయినట్లుగా… సోషల్ వర్కుకు 5 మార్కులు కంపల్సరీ అంటూ ప్రకటించడం లేకిగా ఉంది. అంటే స్కూల్లో మార్కుల ఒత్తిడికే చచ్చిపోతున్న పిల్లలు, ఇక ప్రభుత్వం దయపెట్టే ఈ సోషల్ వర్కు అయిదు మార్కుల కోసం కూడా పనిచేసి చావాలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిర్దిష్టమైన చర్యల జోలికి వెళ్లకుండా.. పైపైనే డాంబికపు ప్రకటనలు చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదని పలువురు వాదిస్తున్నారు.


Recent Random Post: