కొత్త వైరస్ ఇంకా ప్రమాదకరమా ?

కరోనా వైరస్ దెబ్బకే ఇంకా ప్రపంచం బయటపడలేదు. అలాంటిది దీనికన్నా మించిన ప్రమాదకరమైన వైరస్ ప్రపంచాన్ని కమ్మేయబోతోందా ? అవుననే అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ ను మించిన ప్రమాదకరమైన వైరస్ ఖోస్టా-2 ను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ వైరస్ ను గబ్బిల్లాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్త వైరస్ గబ్బిలాల నుండి మనుషులకు చాలా తేలిగ్గా సోకుతుందని గుర్తించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలకు మందులకు ఖోస్టా-2 లొంగదనే నిజాన్ని కూడా శాస్త్రవేత్తలు బయటపెట్టారు. 2020లోనే మొదటిసారి రష్యాలోని గబ్బిలాల్లో ఇలాంటి వైరస్ ను కనుక్కున్నారట. అయితే అప్పట్లో ఈ వైరస్ వల్ల జనాలకు ఇంతస్ధాయిలో ప్రమాదం ఉంటుందని శాస్త్రజ్ఞులు తెలుసుకోలేకపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా మరింత లోతుగా పరిశీలించిన తర్వాత ఇది కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమని తెలుసుకున్నారు.

మనుషుల కణజాలంపైన ఖోస్టా-2 తీవ్రప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో బయటపడింది. ఒమిక్రాన్ నుండి కోలుకుంటున్నవారి మీద దీని ప్రభావం మరింతగా ఉంటుందని కూడా అర్ధమవుతోంది. గబ్బిలాలు పాంగోలిన్లు రక్కూన్ కుక్కలు పామ్ సివెట్స్ వంటి జంతువుల్లో ఖోస్టా-2 వైరస్ ఉంటుందని తేలింది. తాజాగా గుర్తించిన వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

చైనాలో పుట్టి యావత్ ప్రపంచానికి పాకిన కరోనా వైరస్ ఏ స్ధాయిలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందో అందరు చూసిందే. కొన్ని లక్షలమంది జనాలు కరోనా కారణంగా చనిపోయారు. కరోనా వైరస్ లో మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ మరింత ప్రమాదకరంగా మారిన విషయాన్ని ప్రపంచదేశాలకు అనుభవమైంది. చైనాలో పుట్టి ప్రపంచమంతా చుట్టేసిన కరోనా వైరస్ పుట్టింటిని మాత్రం వదలటంలేదు. ఏదో నగరంలో చైనా లాక్ డౌన్ విధిస్తునే ఉంది ఇప్పటికీ.