గుజరాత్‌ పోల్స్‌: మోడీకి కౌంట్‌డౌన్‌.?

గుజరాత్‌ ఎన్నికలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్‌లో రెండు దఫాలుగా గుజరాత్‌ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 9, 14 తేదీల్లో పోలింగ్‌ జరగనుండగా, 18వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. నేటి నుంచే గుజరాత్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. నిజానికి గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల కమిషన్‌పైనా విమర్శలొచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ, ఎన్నికల కమిషన్‌పైనా తనదైన ముద్ర వేశారనీ, తనకు అనుకూలంగా గుజరాత్‌ ఎన్నికలు జరిగేలా వ్యవహరిస్తున్నారనీ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోన్న విషయం విదితమే. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ కౌంటర్‌ ఘాటుగా ఇచ్చిందనుకోండి.. అది వేరే విషయం. మరోపక్క, ఎన్నికల కమిషన్‌ గుజరాత్‌ పోల్స్‌ విషయమై వివరణ ఇచ్చుకున్న తీరు కొత్త అనుమానాలకు తావిచ్చింది.

ఎలాగైతేనేం, గుజరాత్‌ ఎన్నికల వ్యవహారంపై స్పష్టత వచ్చేసింది. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ గుజరాత్‌లో ఎన్నికల ‘హంగామా’ షురూ చేసేశాయి. సుదీర్ఘ కాలం తర్వాత గుజరాత్‌లో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్‌, ఎలాగైనా మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి. ప్రధానంగా నరేంద్రమోడీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే, ఆయన గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆ గుజరాత్‌ పాలనే, దేశవ్యాప్తంగా నరేంద్రమోడీని ‘నాయకుడిగా’ గుర్తించేలా చేసింది.

బీహార్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, నరేంద్రమోడీ ‘వ్యక్తిగత ప్రతిష్ట’కు పోవడం, ఆయా ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురవడం తెల్సిన విషయాలే. అన్నట్టు, బీహార్‌ రాజకీయాల్లో కుంపట్లు రేపి, రాజకీయాన్ని తనకు అనుకూలంగా ఆ తర్వాత బీజేపీ మార్చుకోవడం దేశమంతా చూసింది. మరిప్పుడు, గుజరాత్‌లో ఏం జరుగుతుంది.? తాజా సర్వేలు బీజేపీకి అనుకూలంగా కన్పిస్తున్నా, కాంగ్రెస్‌కి సైతం ఎడ్జ్‌ లేకపోలేదని చెప్పక తప్పదు.

పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి విషయాల్లో నరేంద్రమోడీ సర్కార్‌ పిల్లిమొగ్గలేస్తుండడం, పెట్రోధరలు భగ్గుమంటుండడం.. ఇలా చాలా విషయాల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత దేశవ్యాప్తంగా పెరిగింది. ఆ ఎఫెక్ట్‌ గుజరాత్‌ ఎన్నికల్లో కూడా కన్పించనుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చినా కేంద్రంలో నరేంద్రమోడీ సర్కార్‌కి వచ్చిన ఇబ్బందేమీ లేదని అనుకోవడానికి వీల్లేదు. ఫలితం తేడా కొడితే, నైతికంగా నరేంద్రమోడీ సర్కార్‌కి అది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఆ లెక్కన, గుజరాత్‌ పోల్స్‌ అంటే నరేంద్రమోడీకి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయినట్లే.!


Recent Random Post: