చంద్రబాబుతో గిల్లికజ్జాలకు కమల సంకేతం!

ఆంధ్రప్రదేశ్ లో పార్టీని విస్తరించుకునే ప్రయత్నాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ఏం చేసిందో తెలియదు. కానీ ఏపీ లో మారిన రాజకీయ సినేరియోలో.. కమలదళం కొత్త చేరికల మీద దృష్టి పెడుతోంది. ఈ చేరికలు పార్టీకి ఎంత మాత్రం లాభిస్తాయో లేదో తెలియదు గానీ.. వీటి వలన.. కమల దళం చంద్రబాబునాయుడుతో గిల్లికజ్జాలు పెట్టుకోవడానికి ఇప్పటినుంచే సిద్ధం అవుతున్నది అనే సంగతి మాత్రం అర్థమవుతోంది. చిత్తూరులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి (సీకేబాబు) భాజపాలో చేరడం తెలుగుదేశానికి కంటగింపుగా ఉంది.

చిత్తూరు జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఆ జిల్లాలో తన పూర్వ నేపథ్యాన్ని బట్టి ఆజన్మ శత్రువులు అనదగినటువంటి రాజకీయ ప్రత్యర్థులు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో సికె జయచంద్రారెడ్డి కూడా ఒకరు. చంద్రబాబు అంటేనే కస్సున లేచే ఈ సీకే బాబు.. అప్సట్లో వైఎస్సార్ ప్రధాన అనుచరగణంలో ఉన్నాడు. జగన్ పార్టీ తన సొంతంగా భావించుకుని అక్కడ పెత్తనం చేయడానికి ప్రయత్నించి, భంగపడ్డాడు.

ఈ నేపథ్యంలో మరో ప్రత్యమ్నాయం లేని స్థితిలో భాజపానే ఆయన కోసం మంతనాలు సాగించింది. భాజపా నాయకురాలు పురందేశ్వరి.. స్వయంగా వెళ్లి సికెబాబును కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పట్లోనే ఈ వ్యవహారం ఇరు పార్టీల మధ్య సంబంధాలపై ప్రభావం చూపేలా ఉంటుందని గ్రేటాంధ్ర ఓ కథనం కూడా అందించింది.

కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే సికె బాబు , బెంగుళూరులో అమితషా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లాంఛనం ముగిసింది. అయితే సికె బాబుకు భాజపా ఏ హామీతో పార్టీలోకి తీసుకున్నదో అర్థం కావడం లేదు. ఎమ్మెల్యేగిరీ తప్ప మరో హామీకి ఆయన లొంగడు. కాకపోతే చిత్తూరు అసెంబ్లీసీటులో ప్రస్తుతం తెలుగుదేశానికి చెందిన డికె సత్యప్రభ ఉన్నారు. ఆమె పట్ల పార్టీలో మంచి అభిప్రాయం ఉంది.

ఆమెను పక్కన పెట్టి ఆ సీటును భాజపాకు, అదికూడా తనకు శత్రువైన సికెబాబుకు కేటాయించడానికి చంద్రబాబు ససేమిరా ఒప్పుకోకపోవచ్చు. సత్యప్రభను తప్పిస్తే చంద్రబాబుకు చాలా రకాల సమీకరణాలు దెబ్బతింటాయి. ఇవన్నీ కమలదళానికి స్పష్టంగా తెలిసినప్పటికీ.. చంద్రబాబుతో గిల్లికజ్జాలు పెట్టుకోవడానికే ఆయనను చేర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పైగా ఇలాంటి చంద్రబాబుకు కిట్టని అనేక చేరికలపై పార్టీ కన్నేసిందని కూడా అనుకుంటున్నారు.


Recent Random Post: