
సీబీఐ కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది. కోర్టు నుంచి ఆయనకు ప్రతికూలమైన తీర్పు వెలువడింది. వారానికి ఓసారి కోర్టుకు వస్తే.. న్యాయవ్యవస్థను గౌరవించినట్లే ఉంటుందని, ప్రజల వద్ద మంచి అభిప్రాయమే వస్తుందని అంటూ చేసిన వ్యాఖ్యలకే కోర్టు కట్టుబడింది. జగన్ పిటిషన్ ను పూర్తిగా కొట్టివేసింది.
వైఎస్ జగన్ నవంబరు 2వ తేదీనుంచి పాదయాత్ర చేయబోతున్నారు. ఈనెల 28న వెళ్లి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత.. ఇడుపులపాయలో ప్రారంభించి.. ఆరునెలల పాటు రాష్ట్రంలో 125 నియోజకవర్గాల పొడవునా పాదయాత్ర చేయాలనేది సంకల్పం. అయితే ఇందుకోసం ప్రతివారం కోర్టుకు హాజరు కావడం నుంచి ఆయన మినహాయింపు కోరితే.. గతంలో హైకోర్టు తిరస్కరించింది. వారి సూచన మేరకు, ఆయన సీబీఐ కోర్టులోనే మరో పిటిషన్ వేశారు. ఇవాళ సీబీఐ కోర్టు కూడా తిరస్కరించింది.
అయితే జగన్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వడానికే వీల్లేదన్నట్లుగా సీబీఐ చాలా గట్టిగానే వాదించింది. ఒకవైపు తాను గైర్హాజరైనంత మాత్రాన తన న్యాయవాది వాయిదాలకు వస్తారని, విచారణ ఆగదని జగన్ తరఫున వాదనలు వినిపించినప్పటికీ, విచారణ ఆలస్యం అవుతుందంటూ.. సీబీఐ పేర్కొంది. నిజానికి సీబీఐ తరఫు వాదనల్ని ప్రభావితం చేసేలా.. తెలుగుదేశం నాయకులు కూడా అనేక రకాల ప్రకటనలతో జగన్ విచారణను ఆలస్యం చేస్తారంటూ ఆరోపణలు చేశారు. సీబీఐ వాదనలు కూడా అదే క్రమంలో సాగాయి. దానికి తగ్గట్లుగానే కోర్టు తీర్పు కూడా వచ్చింది.
జగన్ లోటస్ పాండ్ లో ఉదయం నుంచి సీనియర్ నాయకులతో సమావేశం పెట్టుకుని కోర్టు తీర్పు ఎలా వచ్చినా సరే.. పాదయాత్ర చేయాల్సిందేనంటూ మంతనాలు సాగించారు. అయితే.. వారు మంతనాల్లో ఉండగానే.. కోర్టు తీర్పు నిరాశ కలిగేలా వచ్చింది.
Recent Random Post:

















