
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అంటేనే అభద్రతాభావానికి కేరాఫ్ అడ్రస్. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ప్రజాసంకల్పం’ పేరుతో పాదయాత్రకు సిద్ధమవుతున్న వేళ, చంద్రబాబు తీవ్రాతి తీవ్రమైన అభద్రతాభావానికి గురవుతున్నారు. నిజానికి, ఈ పాదయాత్ర వైఎస్ జగన్‌కి కత్తి మీద సాములాంటిదే. ఓ పక్క ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలి.. ఇంకోపక్క, పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు చేజారిపోయారు. ఈ పరిస్థితుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాదయాత్ర సమయంలో, ఒకరిద్దరు ముఖ్య నేతలు జారిపోయినా, మొత్తం శ్రమ అంతా వృధా అయిపోతుంది.
ఆ కోణంలో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టడానికి టీడీపీ వ్యూహాలు ఓ పక్క రచిస్తూనే, ఇంకోపక్క జగన్ పాదయాత్ర ప్రారంభిస్తే టీడీపీ భవిష్యత్తు ఏమైపోతుందోనన్న బెంగతో ఆ పార్టీ ముఖ్య నేతలు, ముఖ్యంగా అధినేత చంద్రబాబు కిందా మీదా పడిపోతున్నారు. ప్రభుత్వం తరఫున జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
‘అనుమతి తీసుకుని ఎవరైనా పాదయాత్ర చేయొచ్చు..’ అని డీజీపీ సాంబశివరావు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా, ‘జగన్ పాదయాత్ర సందర్భంగా తుని లాంటి విధ్వంసాలు జరగొచ్చు..’ అంటూ లేని అపాయాన్ని ముందే అత్యుత్సాహంతో ఊహించేసి, పరిస్థితిని గందరగోళంగా మార్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినా.. ఇదంతా జగన్ పాదయాత్ర పట్ల చంద్రబాబు సర్కార్‌కి వున్న భయాన్ని చెప్పకనే చెబుతోంది.
ఇక, ఇప్పుడు వ్యవహారం ‘అనుమతి’ దగ్గర కొంత రసవత్తరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ‘అనుమతులు తీసుకుంటాం’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చెబితే, వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు మాత్రం ‘అనుమతి’ అన్న మాటే అవసరం వుండదని తెగేసి చెప్పారు. ఈలోగా, పోలీస్ ఉన్నతాధికారుల నుంచి వైఎస్సార్సీపీ ముఖ్య నేతలకు ఈ ‘అనుమతి’పై ‘పర్సనల్ ఫోన్లు’ వస్తున్నాయట. అంటే, జగన్ పాదయాత్రకు ముహూర్తం దగ్గరపడ్తున్న కొద్దీ, టీడీపీ సర్కార్‌లో భయం మరింత పెరుగుతోందన్నమాట.
జగన్ పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలన్న ఆలోచన అయితే టీడీపీలో సుస్పష్టం. నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి వుంది. ఈలోగా ఏమైనా జరగొచ్చు. చంద్రబాబు ముందే ‘అనుమానాలు’ వ్యక్తం చేశారంటే, తెరవెనుక పెద్ద ‘వ్యవహారమే’ ‘పచ్చదండు’ రచిస్తూ వుండి వుండాలి. మరి, ‘పచ్చ’ వ్యూహం పారుతుందా.? జగన్ పంతం నెగ్గుతుందా.? వేచి చూడాల్సిందే.
Recent Random Post:

















