
పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వస్తున్నాడంటే.. అదేదో అద్భుతం జరగబోతోంది అన్నట్టుగా మీడియా కవరేజీ ఇవ్వడం.. తీరా ఆయన వచ్చాకా తన పేలవ ప్రసంగాలతో ఊసురుమనిపించడం రొటీన్ గా జరుగుతున్న వ్యవహారమే. ఇప్పటి వరకూ ఇది చాలాసార్లు జరిగింది. పవన్ రావడం.. హడావుడి చేయడం, పవన్ తన ప్రసంగాల్లో అర్థంలేని అవేశాన్ని, అన్వయంలేని మాటలను చెప్పడం.. ఆ తర్వాత మాయంకావడం ఇదంతా జరుగుతున్న సంగతే.
ఇప్పుడూ అదే జరిగింది. తెలంగాణలో పర్యటన ముందు పవన్ కల్యాణ్ పెట్టిన ప్రెస్ మీట్.. ‘జనసేన’పై అంచనాలను మరింత తగ్గించి వేసింది! ‘మాకు బలం ఉన్న నియోజకవర్గాల్లో పోటీచేస్తాం..’ బహుశా.. చేగువేరా పేరు చెప్పుకునే వ్యక్తి నుంచి రావాల్సిన మాటకాదు ఇది. ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి అయితే పవన్ కల్యాణ్ ఫైడల్ క్యాస్ట్రో, చేగువేరా.. భగత్ సింగ్ వంటి వాళ్ల పేర్లను ఉచ్ఛరించకుండా ఉంటే మంచిది.
ఆ పేర్లకు ఇలాంటి పేలవమైన మాటలకూ ఏమాత్రం సంబంధం లేదు సుమా! ‘ఓటుకు నోటు కేసు సున్నితమైనది.. దానిపై స్పందించను’ సున్నితమైనది అంటే? అది దూదిలాంటిదా? బ్రెడ్డులాంటిదా? ఈ కేసు గురించి స్పందిస్తే.. చంద్రబాబు పరువు పోతుందనో, కేసీఆర్ నుంచి ముప్పు ముంచుకొస్తుందనో భయమా?ఒకవేళ అది కోర్టు పరిధిలోని అంశమంటావా? మరి జగన్ పై రెచ్చిపోయి బురదజల్లడానికి అయితే కోర్టు గుర్తుకు రాదా? జగన్ అవినీతి పరుడు అని ఏ కోర్టు అయినా పవన్ కల్యాణ్ కు చెప్పిందా? ‘ఎన్నికలకు రెండునెలల ముందువరకూ ఎక్కడ పోటీ చేస్తామో చెప్పలేం..’ ఇదీ మరో చేతగాని శౌర్యం.
ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఒక విధానం ఉండాలి, ఒక అజెండా ఉండాలి, ఒక కార్యవర్గం ఉండాలి, ఒకవ్యూహం ఉండాలి.. బహుశా రాజకీయాలను సీరియస్ గా తీసుకునే వాళ్లకేమో అవన్నీ. రెండునెలల ముందు వరకూ ఏమీ చెప్పలేను.. అని అంటున్న జనసేన అధిపతి.. ఎవరిలో నమ్మకం కలిగించాలని అనుకుంటున్నట్లో అర్థంకాని విషయం.
ప్రజల్లోనా.. నేతల్లోనా…? ఎన్నికలకు రెండునెలల ముందు వరకూ ఎక్కడ పోటీ చేస్తామో, ఎలా పోటీ చేస్తామో కూడా చెప్పలేమనే పార్టీలోకి ఏ దైర్యంతో నాయకులు వస్తారు? మొత్తానికి పవన్ కల్యాణ్ రాజకీయంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. పవన్ జనాల ముందుకు.. మీడియా ముందుకు ఎంత ఎక్కువగా వస్తే.. అంత త్వరగా ఆయన పార్టీపై అంచనాలు జీరో రేంజ్ కు రాబోతున్నాయి.
Recent Random Post:

















