జస్ట్‌ ఆస్కింగ్‌: కడిగి పారేస్తున్న ప్రకాష్‌ రాజ్‌

సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌, రాజకీయాల్లోకి వస్తాడా.? తమిళ, కన్నడ, తెలుగు, హిందీ.. ఇలా అనేక సినిమాల్లో నటించి, ఆయా సినిమాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్‌, గత కొన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తోన్న దరిమిలా, ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమన్న ప్రచారమైతే జరుగుతోంది.

కానీ, ప్రకాష్‌రాజ్‌ ఈ విషయమై ఇప్పటిదాకా పెదవి విప్పడంలేదు. ‘నేను ఓ భారతీయుడ్ని.. నా దేశంలోని ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంభిస్తున్నప్పుడు పౌరుడిగా ప్రశ్నించే హక్కు నాకుంది. నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని కాదు, భారత ప్రధాని. ఆయన నిర్ణయాలు తప్పయితే, వాటిని ప్రశ్నించి తీరతాను..’ అంటూ మొన్నామధ్య బెంగళూరులో జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యానంతరం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించి వార్తల్లోకెక్కారు ప్రకాష్‌రాజ్‌.

అప్పటినుంచీ, బీజేపీకీ – ప్రకాష్‌రాజ్‌కీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో కొన్నాళ్ళు ఈ వ్యవహారం సద్దుమణిగినా, ఇప్పుడు ప్రకాష్‌రాజ్‌ సోషల్‌ మీడియా వేదికగా ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించడంతో వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. ప్రకాష్‌ రాజ్‌ సినీ ప్రముఖుడు గనుక, బోల్డంత పాపులారిటీ వున్న వ్యక్తి గనుక, ఆయన ప్రశ్నించే ప్రశ్నలకు ఖచ్చితంగా ‘పబ్లిసిటీ’ వచ్చి తీరుతుంది. ఆ ప్రశ్నల్లో నిజాయితీ వున్నప్పుడు, ఎవరయినా ఆయన ప్రశ్నల్ని తప్పు పట్టలేరు.

కానీ, ప్రకాష్‌రాజ్‌ టార్గెట్‌ చేసింది కేంద్రాన్ని గనుక, ఆ కేంద్రాన్ని నడుపుతోన్నది ప్రధాని గనుక, సహజంగానే కమలనాథులకు ఒళ్ళు మండిపోతుంది. తాజ్‌మహల్‌, టిప్పు సుల్తాన్‌, రైతు సమస్యలు వంటి విషయాల్లో బీజేపీ చేస్తున్న ఓవరాక్షన్‌ని ప్రకాష్‌రాజ్‌ ప్రశ్నించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండడం గమనార్హం. ఆటోమేటిక్‌గా మోడీ మద్దతుదారులు ప్రకాష్‌రాజ్‌ని ట్రాలింగ్‌లోకి లాగేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం.

ఆ మధ్య సినీ నటుడు కమల్‌హాసన్‌ కూడా ఇలాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్ని, కేంద్రం పలు సందర్భాల్లో అనుసరించిన వైఖరిని ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ, రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని ప్రకటించేశాడు. మరి, ప్రకాష్‌రాజ్‌ కూడా అదే బాటలో నడుస్తాడా.? వేచి చూడాల్సిందే.


Recent Random Post: