
కేంద్రంనుంచి మన రాష్ట్రానికి పెద్దగా నిధులు రాకపోతే… దానికి అధికార్లు ఏం చేయగలరు? మన రాష్ట్ర వనరులను బట్టి అవసరాలు, పరిస్థితులతో వారు నివేదికలు చేసి కేంద్రానికి పంపగలరు తప్ప.. నిధులు రావడం రాకపోవడం అనేది వారి చేతుల్లో ఉండదు కదా! అయినా సరే.. తాను సమీక్ష సమావేశం అంటూ జరిపిన తర్వాత.. ప్రతిశాఖకూ ఏదో ఒక హెచ్చరిక ఉండాలని భావించే చంద్రబాబునాయుడు హూంకరించారు.
కేంద్రం నుంచి దండిగా నిధులు వచ్చేలా చూడకపోతే.. మీ జీతాల్లో కోత పెట్టాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికను ఆయన నవ్వుతూ కామెడీ గానే చేశారు గానీ.. కొంచెం సీరియస్ గా లోతుగా , భిన్నంగా కూడా పరిశీలించాలి. అధికార్లు సరే.. మరి నాయకుల సంగతేమిటి? పనితీరు ఆధారంగా ప్రజాప్రతినిధుల జీతాలకు కూడా కోత పెడతారా? అనే ప్రశ్న ప్రజల మదిలో మెదలుతోంది.
చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్పు నిర్వహించి తన సహజశైలిలో అధికారుల వైఫల్యాల గురించి పదేపదే చెప్పుకొచ్చారు. నేను అదిలిస్తే మాత్రమే పని జరుగుతుంది.. ఒకటి పదిహేను సార్లు చెప్పాల్సి వస్తోంది.. నాకే సిగ్గేస్తోంది.. ఇలా తప్పులన్నీ అధికార్ల వైపునే ఉన్నట్లుగా ఆయన మాట్లాడారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేంద్రం నుంచి నిధులు సరిగా రాబట్టడం లేదని, పైగా మత్స్య శాఖ నిధులు తమిళనాడుకు ఎక్కువగా వెళుతున్నాయని అంటూ మత్స్యశాఖ అధికారిని మీ జీతంలో కోత పెట్టిస్తా అంటూ చంద్రబాబు సరదాగా హెచ్చరించడం విశేషం. ఆయన సరదా బాగానే ఉంది. మరి వైఫల్యాలు అధికార్లవి మాత్రమేనా అనేది ప్రశ్న. శాఖా వైఫల్యం అయితే దానికి సంబంధించి మంత్రిని కూడా బాధ్యుణ్ని చేయాలి కదా? రాజకీయ నాయకుల మీద మాత్రం చర్యకు ఉపక్రమించడానికి చంద్రబాబునాయుడు తెగువచూపించగలరా? అనేది ప్రశ్న.
ప్రత్యేక హోదా సాధించలేకపోయిన రాష్ట్ర నాయకుల చేతగానితనం మాటేమిటి? కేవలం మత్స్యశాఖకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి రాబట్టేలా ప్రతిపాదనలు పంపనందుకే అధికారుల జీతంలోంచి కోతలు పెడితే, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయువుపట్టు వంటి ప్రత్యేక హోదాను కేంద్రంనుంచి రాబట్టడంలో పూర్తిగా విఫలమైన రాజకీయజడుల్ని ఏం చేయాలి? లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్న నాయకుల నుంచి ఎన్ని తరాల పాటూ జరిమానాలు వసూలు చేస్తే.. ప్రత్యేక హోదా అవకాశాన్ని కోల్పోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఈ రాష్ట్రం పూడ్చుకోగలుగుతుంది. ఇలాంటి ప్రశ్నలకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇదే ప్రశ్న అధికారులు తిరిగి అడిగితే ఆయన ఏం జవాబు చెప్పగలరు? కన్నెర్ర చేసి గుడ్లురుముతారు.. అంతకు మించి మరేమీ ఉండదు అనే విమర్శలూ వస్తున్నాయి.
Recent Random Post:

















