టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ చైర్మన్ 10లక్షల సాయం

ఇటీవల కరోనా కారణంగా కన్నుమూసిన జర్నలిస్టు, నటుడు టిఎన్‌ఆర్‌ కుటుంబానికి ఐడ్రీమ్‌ మీడియా అండగా నిలిచింది. సంస్థ ఛైర్మన్‌ చినవాసుదేవ రెడ్డి స్వయంగా టీఎన్‌ఆర్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. దీంతోపాటు టీఎన్‌ఆర్‌ పిల్లల చదువుకై పూర్తి బాధ్యతలు తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ద్వారా ఎమోషనల్‌ పోస్టు చేశారు.

‘టీఎన్‌ఆర్‌ కేవలం ఐ డ్రీమ్‌ సంస్థకు ఉద్యోగి మాత్రమే కాదు. వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు, స్నేహితుడు. సంస్థ ఎదుగుదలకు ఎన్నో సూచనలు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండటం నా బాధ్యత. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, జ్యోతి గారికి కావాల్సిన నైతిక, ఆర్థిక మద్దతు అందజేసే విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు. వ్యక్తిగా TNR మనమధ్య లేకపోయినా ఆయన విడిచి వెళ్లిన జ్ఞాపకాలు, చేసిన కళాసేవ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి’ అని అన్నారు.

టీఎన్ఆర్ పేరు మీద జరుగుతున్న విరాళాల్లో ఒకటి ఆయన భార్య జ్యోతి అకౌంట్ కు నేరుగా డబ్బు జమ అవుతూండగా.. అమెరికాలో GoFundMe ద్వారా మాత్రమే విరాళలు సేకరణ జరుగుతోందని అన్నారు.