
‘నంద్యాల ఉప ఎన్నికలో గెలిచాం కదా.. పార్టీ ఫిరాయింపులు, రాజకీయ వ్యభిచారం అంటూ ప్రత్యర్థులు చేస్తోన్న ఆరోపణలకు అదే సమాధానం..’
– ఇదీ తెలుగుదేశం పార్టీ సర్వ రోగ నివారణ మంత్రం.!
పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలలో, ఓ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో నంద్యాల ఉప ఎన్నిక తలెత్తింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో సహజంగానే సెంటిమెంట్ వుంటుందక్కడ. ఆ సెంటిమెంట్‌కి తోడు, అధికార పార్టీ అడ్డగోలుగా ఖర్చు చేసి, అధికారాన్నంతా కేంద్రీకరించి నంద్యాల ఉప ఎన్నికలో గెలిచిందన్నది ఓపెన్ సీక్రెట్.
అప్పట్లో ఆ ఉప ఎన్నిక ఫలితమే పార్టీ ఫిరాయింపులపై వస్తోన్న విమర్శలకు సమాధానమంటూ అధికార పార్టీ గట్టిగానే చెప్పుకుంది. అయితే, రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌తో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సంకటం పుట్టుకొచ్చింది. రేవంత్‌రెడ్డి టీడీపీని వీడుతూ, టీడీపీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో, ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా తయారైంది.
నంద్యాల పేరు చెప్పి ఇప్పుడు తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి. అందుకే, నంద్యాల ఉప ఎన్నిను ప్రస్తావిస్తూనే, అదనంగా ‘ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా..’ అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. ‘లోటుబడ్జెట్‌తో ఏర్పడ్డ రాష్ట్రం.. రాజధాని లేని రాష్ట్రం.. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి అండగా వుండడం మాకు గర్వకారణం..’ అన్నది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో కొందరి వాదన. ‘అరరె, నంద్యాల ఉప ఎన్నిక ఫలితం సర్వరోగ నివారిణి అనుకున్నామే.. ఇంతలో రేవంత్ తలనొప్పి వచ్చిపడిందే..’ అని ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తలపట్టుక్కూర్చోవాల్సి వస్తోంది.
ప్రతిపక్షం కాస్త తొందరపడి, అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించిందిగానీ, లేదంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ ఎపిసోడ్‌ని ప్రస్తావిస్తూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు.. తద్వారా అధికార తెలుగుదేశం పార్టీకీ అసెంబ్లీలో దిమ్మతిరిగే రీతిలో కౌంటర్లు ఇచ్చే అవకాశం వుండేది.
Recent Random Post:

















