
పోయినేడాది కొన్ని రొటీన్ సినిమాలతో తన పేరును దెబ్బ తీసుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. ఆ డ్యామేజీని ఈ ఏడాది కొత్త సినిమాలతో పూడ్చేయడానికి రెడీ అవుతున్నట్లున్నాడు. ముందుగా ‘రంగస్థలం’ సినిమాతో దేవిశ్రీ ఓ రేంజిలో రచ్చ చేయబోతున్నాడనడానికి ‘ఎంత సక్కగున్నావే’ పాటే నిదర్శనం. ఈ ఒక్క పాటతో తనపై గత ఏడాది వచ్చిన విమర్శలన్నింటికీ బదులు చెప్పాడతను. ఫుల్ ఆడియో కూడా ఈ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి రెండో పాట ‘రంగమ్మా రంగమ్మా’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత ఇంకో పాట రిలీజ్ చేసి.. ఆ తర్వాత ఫుల్ ఆడియో లాంచ్ చేస్తారట.
ఇక ‘రంగస్థలం’ ప్రి రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున విశాఖపట్నంలో చేయడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ హీరోలకు మామూలుగానే విశాఖలో ఫాలోయింగ్ ఎక్కువ. అక్కడ ఈవెంట్లు చేయడం వారికి సెంటిమెంటు. చరణ్ సినిమా వేడుకను కూడా అక్కడ భారీగానే ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. దేవి ఇలా పెర్ఫామ్ చేయడం కొత్త కాదు కానీ.. గత కొన్నేళ్ల నుంచి అతడి ఆడియో వేడుకలు మామూలుగా సాగిపోతున్నాయి. ‘రంగస్థలం’తో మళ్లీ తనేంటో చాటి చెప్పాలని పట్టుదలతో ఉన్న దేవి.. ప్రి రిలీజ్ ఈవెంట్లో హంగామా చేయడానికి రెడీ అయ్యాడు. మార్చి మూడో వారంలో ఈ ఈవెంట్ జరగొచ్చని సమాచారం. అంతకంటే ముందు హైదరాబాద్‌లో ఆడియో వేడుక కొంచెం సింపుల్‌గా చేసే అవకాశముంది.
Recent Random Post:

















