
ఒకప్పట్లో చంద్రబాబునాయుడు చిటికె వేసి చెబితే.. ఢిల్లీ సర్కారులో పనులు నెరవేరిన సందర్భాలు ఉన్నాయో లేదో మనకు తెలీదు. ఆయన అనుచరులు కొందరు అలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. చిటికె వేయడం కాదు కదా.. ఆయన డప్పు కొట్టి వేడికోళ్లు సమర్పించుకున్నా సరే.. ఢిల్లీ సర్కారు ఆలకించే పరిస్థితి లేదు. చెవిన వేసుకోవడం లేదు. పరిగణనలోకి తీసుకోవడం లేదు. పట్టించుకోవడం లేదు.
పేరుకు తాము కూడా కేంద్రంలో భాగస్వాములం అని చెప్పుకోవాల్సింది తప్పితే.. కేంద్రంలో ఏ నిర్ణయాన్నీ తమ అభిప్రాయాలకు రాబట్టగల నేర్పుగానీ, ఏ నిర్ణయాన్ని తాముగా ప్రతిపాదించి ఆమోదింపజేసుకోగల అధికారం గానీ చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు లేవని పలు సందర్భాల్లో రుజువు అయింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరగడానికి కొత్త టెండర్లు పిలవాలని, కాంట్రాక్టరును మార్చాలని ఆయన చేసిన (పట్టుబట్టిన) ప్రతిపాదనను నితిన్ గడ్కరీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం చాలా పెద్ద పరిణామం.
చంద్రబాబునాయుడు దేశంలో లేని సమయంలో.. కేంద్రం పోలవరం గురించి అధికార్ల బృందాన్ని పంపి తెప్పించుకున్న వివరాల ఆధారంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల ఎఫెక్టు.. లండన్ లో బిజీ షెడ్యూల్ లో ఉన్న చంద్రబాబుకు షాక్ కొట్టి ఉంటుందని చెప్పకతప్పదు.
కేవలం చంద్రబాబు ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చడం మాత్రమే కాదు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా తీవ్రమైనవి. ప్రభుత్వానికి అవమానకరమైనవి అని పలువురు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నాయని ఐసీయూలో ఉన్న పేషంటును చంపేయడం కంటె.. చికిత్స చేయించి బతికించుకోవడం మంచిది కదా అనే మాటలు వెటకారం కాక మరేమిటి? కాంట్రాక్టరును మార్చే ప్రసక్తేలేదు. ఇదే డబ్బుతో మరెవరైనా కాంట్రాక్టర్లు చేయడానికి ఒప్పుకుంటే గనుక చేయించుకోండి.. అనడం ముందరి కాళ్లకు బంధం వేయడమే.
ఇప్పుడు టెండర్లు పిలిస్తే అంచనాలకంటె 25శాతం అదనపు వ్యయం అవుతుంది. ఆ ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించేట్లయితే మళ్లీ టెండర్లు పిలవడానికి మాకు అభ్యంతరం లేదని గడ్కరీ చెప్పడం.. వెటకారానికి పరాకాష్ట. రెండేళ్ల కిందట టెంకాయ కొట్టి.. ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మిస్తాం అని చెప్పుకుంటూ.. ఇప్పటిదాకా ఓ ఇటుక పేర్చడానికి కూడా గతిలేని రాష్ట్రంతో.. గడ్కరీ జోకులేసినట్లుగా భావించాలి.
అయితే వేగంగా నిర్మాణం సాగించడం అనేమాట చెబుతూ … కాంట్రాక్టరును మార్చేయడం మరో పదివేల కోట్లకు పైచిలుకు భారం పెంచడం వంటి చంద్రబాబు ప్రతిపాదనలు మంటగలిసిపోయాయి. ఢిల్లీలో జరిగిన మీటింగు, తన అభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల ఎఫెక్టు.. లండన్ లో ఉన్న చంద్రబాబుకు షాక్ తగిలి ఉంటుందనడంలో సందేహం లేదు.
Recent Random Post: