
సినీ నటి వాణి విశ్వనాథ్, తెలుగుదేశం పార్టీలో చేరనున్న విషయం విదితమే. గత కొంతకాలంగా ఈ విషయమై మీడియాలో రకరకాల కథనాలు విన్పిస్తున్నాయి. ఇంకా, టీడీపీలో చేరకుండానే వాణి విశ్వనాథ్, తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతల్ని తీసుకున్నట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. స్వర్గీయ ఎన్టీఆర్ మీద అభిమానంతో, చంద్రబాబు పాలనా దక్షత మీద నమ్మకంతో టీడీపీలో చేరాలనుకుంటున్నట్లు వాణి విశ్వనాథ్ ఆల్రెడీ ప్రకటించేసింది. కానీ, ఇంతవరకూ ఆమె టీడీపీలో చేరలేదు.!
‘టీడీపీలో చేరేదెప్పుడు.?’ అని ప్రశ్నిస్తే, ‘ఆ ముహూర్తం నిర్ణయించాల్సింది చంద్రబాబే..’ అని తేల్చేసిందామె. టీడీపీలో ఏ పని చెయ్యాలి.? ఎక్కడి నుంచి పోటీ చెయ్యాలి.? వంటి విషయాల్ని చంద్రబాబే నిర్ణయిస్తారని వాణి విశ్వనాథ్ చెబుతున్నారు. చిత్తూరు జిల్లా నగిరి నుంచి పోటీ చేయాలని వుందంటూ వాణి విశ్వనాథ్ ప్రకటించేశాక, చంద్రబాబు నిర్ణయించడానికేముంటుంది.?
వైఎస్సార్సీపీలో రోజా రూపంలో సినీ గ్లామర్ వుండడంతో, ఆమెకు పోటీగా వాణి విశ్వనాథ్‌ని టీడీపీ కేవలం ‘గ్లామర్’ కోణంలోనే రంగంలోకి దించుతోందనుకోవాలి. అయితే, ఇక్కడ గ్లామర్ పరంగా ఈక్వేషన్స్ ఎలా వున్నా, వాగ్ధాటి విషయంలో రోజాతో వాణి విశ్వనాథ్‌ని అస్సలేమాత్రం పోల్చలేం. రోజా మాట తీరులో స్పష్టత, వాణి విశ్వనాత్లో కన్పించదు. ఇక్కడే వాణి విశ్వనాథ్‌కి మైనస్ మార్కులు పడిపోతాయి. అందుకే, ఆమెకు తెలుగులో మాట్లాడటంలో శిక్షణ ఇప్పిస్తోందట టీడీపీ టీమ్. రాజకీయ ప్రసంగాలు, ప్రత్యర్థులు చేసే రాజకీయ విమర్శల్ని తిప్పి కొట్టడం.. ఇలాంటి అంశాల్లో వాణి విశ్వనాథ్ శిక్షణ పొందుతోందట. అది పూర్తయ్యాక వాణి విశ్వనాథ్, అధికారికంగా టీడీపీలో చేరతారని తెలుస్తోంది.
జయప్రద నుంచి కవిత దాకా.. టీడీపీలో చేరి, అవమానాలపాలై, చివరికి టీడీపీని వీడిన మహిళా నేతలు (మరీ ముఖ్యంగా సినీ గ్లామర్‌తో వచ్చినవాళ్ళు) ఎందరో కన్పిస్తారు. రోజా సైతం ఆ తరహా బాధితురాలే. మరి, రాజకీయాల్లో వాణి విశ్వనాథ్ భవిష్యత్ ఏం కాబోతోంది.? వేచి చూడాల్సిందే. అన్నట్టు, సీనియర్ నటి కవిత టీడీపీని వీడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.
Recent Random Post: