నన్ను వివాదాల్లోకి లాగొద్దు: విద్యాబాలన్‌

జాతీయ గీతం సినిమా థియేటర్లలో ఆలపించాలనడం, దాన్ని తప్పనిసరిగా గౌరవించాలనడం సబబేనా.? అన్న ప్రశ్న సినీ ప్రముఖుల్ని ఒకింత గట్టిగానే ఇబ్బందిపెడుతోంది. ‘జాతీయ గీతాన్ని గౌరవిస్తాం.. కానీ, సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరి చేయడం, దాన్ని గౌరవించాలనడం సబబు కాదేమో..’ అంటూ పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

‘చట్టసభల్లో ప్రతిరోజూ, ప్రతి సెషన్‌లో జాతీయ గీతం ఎందుకు ఆలపించడంలేదు..’ అని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్తోంటే, క్రికెటర్‌ గంభీర్‌ మాత్రం ‘ఏం, టిక్కెట్ల కోసం నాలుగైదు గంటలు నిలబడ్తారా.? ఒక్క నిమిషం పాటు ఆలపించబడే జాతీయ గీతాన్ని గౌరవిస్తూ నిల్చోలేరా.?’ అని ప్రశ్నించడం గమనార్హం.

ఇక, ఈ వ్యవహారంపై బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌ స్పందించింది. ‘సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపన సబబు కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం..’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ‘నేను మాత్రం జాతీయ గీతం ఎప్పుడు విన్పించినా, లేచి నిల్చుంటా.. నా దేశభక్తిని ఎవరికోసమో ప్రదర్శించాల్సిన అవసరం లేదు..’ అని అంటోంది విద్యాబాలన్‌.

అయితే, ఇలా మాట్లాడినందుకు తనను వివాదాల్లోకి లాగకూడదనీ, కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని విద్యాబాలన్‌ క్లారిటీ ఇచ్చింది. విద్యాబాలన్‌ బాలీవుడ్‌ నటి మాత్రమే కాదు, ఆమె సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌లో సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. అన్నట్టు, విద్యాబాలన్‌ ప్రస్తుతం ‘తుమ్హారీ సులు’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే.


Recent Random Post: