నెటిజన్లు మరో నటిని బతికుండగానే చంపేశారు

కాస్త వయసు మళ్లి లైమ్ లైట్లో లేకుండా ఉంటే.. వాళ్లను బతికుండగానే చంపేస్తుంటారు కొందరు సోషల్ మీడియా జనాలు. ఇలా లేని పోని రూమర్లు పుట్టించి చర్చనీయాంశం చేయడం ద్వారా పైశాచిక ఆనందం పొందుతుంటారు. ఏది నిజమో.. ఏదో అబద్ధమో తెలియక మామూలు జనాలు కూడా ఆ వార్తల్ని ప్రచారంలోకి తీసుకెళ్లిపోతుంటారు. ఇలా బతికుండగానే సోషల్ మీడియాలో చచ్చిపోయిన ప్రముఖులకు లెక్కే లేదు. కొన్ని రోజుల కిందట సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ చనిపోతే.. కైకాల సత్యనారాయణ చనిపోయారంటూ ప్రచారం చేశారు. దీంతో కైకాల కుటంబీకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

తాజాగా ఇలాంటి పరిణామమే మరోసారి జరిగింది. ప్రముఖ నటి జయంతి చనిపోయారంటూ నిన్న సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జయంతి ఆదివారం బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తోంది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐతే మీడియాలో ఆమె చనిపోయిందంటూ వార్తలు వచ్చేశాయి.

ఈ ప్రచారాన్ని జయంతి కుటుంబ సభ్యులు ఖండించారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్న మాట వాస్తవమే అని.. ఐతే ఆమె చనిపోలేదని వారు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం జయంతి వయసు 73 ఏళ్లు. ఆమె తెలుగుతో పాటు దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్.. ఎమ్జీఆర్.. రాజ్ కుమార్.. ఇలా ఎంతోమంది అగ్ర హీరోలతో పని చేశారు. ఆమె 500కు పైగా సినిమాలు చేయడం విశేషం.


Recent Random Post: