
లాంఛనం పూర్తి అయ్యింది.. బుట్టా రేణుక టీడీపీ పరమయ్యారు. తెలుగుదేశంలో చేరిపోయారు. జగన్ పాదయాత్ర ఆరంభం వరకూ రేణుక చేరకపోవచ్చు.. పాదయాత్ర ఆరంభం అయ్యాకే ఈ చేరిక ఉంటుందని అనుకున్నారంతా. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే పొగబెట్టే సరికి.. రేణుక తెలుగుదేశంలో చేరిపోయారు. చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. అదేమంటే.. అందరూ చెప్పినట్టుగానే ‘డెవలప్మెంట్’ కోసమే అని రేణుక రొటీన్ మాటనే చెప్పారు.
డెవలప్ మెంట్ కావాలంటే తెలుగుదేశంలోనే చేరాలి.. అని రేణుక అన్నారు. నిజమే.. పార్టీ ఫిరాయింపుతో డెవలప్మెంట్ ఖాయంగా ఉంటుంది. అదెవరి డెవలప్మెంట్ అనేదే శేష ప్రశ్న! ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తను తెలుగుదేశంలో చేరినట్టుగా ప్రకటించిన బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీ కండువాను మాత్రం వేసుకోలేదు! బుట్టా వెంట తట్టా బుట్ట సర్దుకుని వచ్చిన కొంతమంది పచ్చకండువాలు వేయించుకున్నారు, చంద్రబాబు చేతులతో వాటిని వేయించుకుని మురిసిపోయారు.
అయితే రేణుక మాత్రం వేసుకోలేదు. మళ్లీ ఎక్కడొచ్చిన గొడవ అనుకుందో ఏమో కానీ.. వెనుకటికి గుత్తా సుఖేందర్ రెడ్డి వలె పార్టీ కండువా వేసుకోకుండానే ఆ పార్టీలోకి చేరారు ఈమె. కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన సందర్భంలో గుత్తా గులాబీ కండువాను వేయించుకోలేదు. అదే రీతిన బుట్టా రేణుక కూడా టీడీపీ కండువా వేసుకోలేదు. కండువా వేసుకుంటే.. ఆ వీడియోలు చూపించి లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే అనర్హత వేటు పడుతుందేమో అనేది వీరి భయం లాగుంది. అయినా అలాంటి భయాలు ఎందుకు.. రాజకీయ వ్యభిచారం అనదగ్గ ఫిరాయింపులు చాలా కామన్ అయిపోయాయి కదా.
అలాంటి పనులు చేసి కూడా చాలా మంది తలెత్తుకుని తిరుగుతున్నారు. తమను ఏమైనా అంటే తిరిగి తిట్టిపోస్తున్నారు. మంత్రులుగా వెలిగిపోతున్నారు. ఫిరాయింపు చేశారు కదా, పదవికి రాజీనామా చేయరెందుకు? అంటే ఎదురుదాడి చేస్తారు. మళ్లీ నీతులు చెబుతారు. బుట్టారేణుక టీడీపీ చేరిన సందర్భంగా అలాంటి ఫిరాయింపుదారులే ఆమెకు స్వాగతం పలికారు.. అఖిలప్రియ తదితరులన్నమాట!
Recent Random Post:

















