
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మునిసిపల్ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ సొంతమయ్యింది. ఛైర్మన్ ఎంపిక విషయమై గత కొద్ది రోజులుగా రసవత్తర రాజకీయం నడిచింది. అధికార పార్టీ నిస్సిగ్గు రాజకీయాలకు తెరలేపిందక్కడ. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 10 సీట్లు గెల్చుకోగా, వైఎస్సార్సీపీకి 16 సీట్లు దక్కాయి. ఒకటి ఇతరుల ఖాతాలోకి వెళ్ళింది. ఆ లెక్కన, ఎలాంటి గందరగోళం లేకుండానే జగయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీకి దక్కాలి.
కానీ, ఆంధ్రప్రదేశ్లో వివిధ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏ తరహా నికృష్ట రాజకీయాలకు తెరలేపిందో, ఇక్కడా అదే నికృష్ట రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది తెలుగుదేశం పార్టీ. నిన్ననే ఛైర్మన్ ఎంపిక జరగాల్సి వుండగా, టీడీపీ విధ్వంసం సృష్టించడంతో ఛైర్మన్ ఎంపిక నేటికి వాయిదా పడింది. ఈ రోజూ ఛైర్మన్ ఎంపిక వ్యవహారంపై టీడీపీ నానా యాగీ చేసింది. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ కిడ్నాప్ చేసిందంటూ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. అయితే, ఛైర్మన్ ఎంపికకు కావాల్సిన మెజార్టీ వున్న వైఎస్సార్సీపీ, టీడీపీ కౌన్సిలర్లను ఎందుకు కిడ్నాప్ చేస్తుందట.!
ఎంత యాగీ చేసినా, అధికార పార్టీకి షాక్ తప్పలేదు. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్గా ఇంటూరి రాజగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ పంతం నెగ్గలేదన్న అక్కసుతో ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. మామూలుగా అయితే, మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక వ్యవహారానికి ఇంత రాద్ధాంతం అవసరమే లేదు. కానీ, అక్కడున్నది టీడీపీ కదా.!
ఇంతా చేసి, అధికార పార్టీ జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక వ్యవహారంలో కొరివితో తలగోక్కున్నట్లయ్యింది. పరువు పోగొట్టుకున్న టీడీపీ, ఎన్నికల నిర్వహణాధికారిపై ఆరోపణలు చేస్తూ, బుకాయింపు చర్యలకు దిగుతుండడం కొసమెరుపు.
Recent Random Post:

















