పవన్ పూజల్లో క్రిస్టియానిటీనే కరువైంది!

ఒకసారి పాల్టిక్సులోకి వచ్చాక నాయకులకు చాలా రకాల సెంటిమెంట్లు ఏర్పడుతాయి. తమ ఇష్టాలతో నిమిత్తం లేకుండా.. తమను గమనిస్తూ ఉండగల వారిని ఇంప్రెస్ చేయడం కోసం చాలా పనులు చేస్తుంటారు. సెంటిమెంట్లు లేని నేతలు కూడా సర్వమత ప్రార్థనలు గట్రా చేస్తూ ఉండడం అలాంటి పనే! ఆ లెక్కల ప్రకారం చూసినప్పుడు.. తాము అన్ని మతాలకూ చెందిన వాళ్లం అని చాటుకోవడం నాయకులకు అత్యవసర బాధ్యత అవుతుంది.

అన్ని మతాలను ఆదరించడమూ సమపాళ్లలో తూకం కుదిరేలా అంతా చూసుకుంటారు. అయితే బుధవారం నాడు హైదరాబాదులో పార్టీ కార్యలయాన్ని ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతల్లో మాత్రం కాస్త క్రిస్టియానిటీ పాళ్లు తగ్గినట్లుగా ఉన్నదని సరదాగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ బుధవారం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా త్వరలోనే అమరావతిలో కూడా కార్యాలయం ప్రారంభించబోతున్న సంగతిని కూడా వెల్లడించారు. సాంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాలతో ‘తొలుత నవిఘ్నమస్తనుచు‘ గణేశ్ ప్రతిమను ఆఫీసులోకి తీసుకువెళ్లి పవన్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్ ఆలీ.. తాను తెలుగులో రాసిన పవిత్ర ఖురాన్ ప్రతిని పవన్ కు కానుకగా ఇవ్వడంతో.. ఇస్లాంకు సంబంధించిన తంతు కూడా పూర్తయింది.

అలాగే నిమ్మల వీరన్న అనే తెలంగాణ సామాజిక ఉద్యమకారుడిని పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన కాన్షీరాం నుంచి ప్రేరణ పొందిన గొప్ప వ్యక్తి అని కితాబులివ్వడం ద్వారా దళిత వర్గాన్ని కూడా పవన్ సంతృప్తి పరచినట్లయింది. అయితే ఈ కార్యక్రమం గురించి అధికారికంగా వచ్చిన వార్తల ప్రకారం అయితే .. ఆయన పూజాదికాల్లో క్రిస్టియానిటీ కొంత లోపించిందనే సరదా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నాయకులు ఇలా తాము సర్వమతాలను సమానంగా చూస్తామని చాటుకునే ప్రయత్నం చేయడం కొత్త కాదు. జగన్ కూడా.. తన పాదయాత్రకు ముందుగా.. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నాక, కడప పెద్ద దర్గాలో పూజలు చేసి, అనంతరం పులివెందుల చర్చిలో పూజలు చేసేలా షెడ్యూలు చేసుకున్నారు. అన్ని మతాల వారిని సమానంగా ఇంప్రెస్ చేయడంలో అందరిదీ ఒకటే దారిలా కనిపిస్తోంది కదా!


Recent Random Post: