పిక్‌ టాక్‌: అటు వైరం, ఇటు ‘మెగా’ స్నేహం

చిరంజీవి, రాజశేఖర్‌ ఒకప్పుడు సన్నిహితులే. కానీ, కొన్ని కారణాలతో ఇద్దరి మధ్యా వైరం పెరిగింది. ప్రధానంగా రాజశేఖర్‌, చిరంజీవి మీద అమితమైన ‘వైరాన్ని’ పెంచుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావిస్తే, ‘నాకేమీ చిరంజీవి మీద కోపంలేదు.. ఎందుకో ఆయనే నన్ను దూరం పెట్టారు..’ అని చెబుతారు. కొన్ని సినిమాల రీమేక్‌ల విషయమై ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయన్నది రాజశేఖర్‌ పరోక్షంగా చెప్పినమాట.

సినిమాల సంగతి పక్కన పెడితే, రాజకీయాల్లో చిరంజీవిని ఢీ కొట్టలేకపోయినా, కనీసం చిరంజీవి ఇమేజ్‌ని అయినా తగ్గించాలన్న ప్రయత్నం రాజశేఖర్‌, ఆయన సతీమణి జీవిత చేశారు. అందులో కొంత మేర సఫలమయ్యారు కూడా. రాజశేఖర్‌ దంపతులపై చిరంజీవి అభిమానుల దాడి, అంతకు ముందు చిరంజీవి మీద రాజశేఖర్‌ దంపతులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద రచ్చే నడిచింది.

ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి, చిరంజీవి కేంద్రమంత్రి అవడం, ఆ షాక్‌తో రాజశేఖర్‌ దంపతులు, కాంగ్రెస్‌కి దూరమవడం తెల్సిన విషయాలే. ఏమయ్యిందో, మళ్ళీ రాజశేఖర్‌ దంపతులు మెత్తబడ్డారు. రాజశేఖర్‌ అయితే, చిరంజీవి సినిమాలో విలన్‌ పాత్ర చేయాలని వుందన్నారు. కానీ, చిరంజీవి నుంచి పాజిటివ్‌గా స్పందన రాలేదు. ఇప్పుడు తన సినిమా ‘గరుడవేగ’ ప్రమోషన్‌ కోసం, రాజశేఖర్‌ – చిరంజీవి వద్దకు వెళ్ళారు.

చిరంజీవి, షరామామూలుగానే సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజశేఖర్‌ దంపతులతో చెప్పారు. ఇదిగో ఇలా తనను కలిసిన రాజశేఖర్‌ దంపతులతో ముచ్చటించారు చిరంజీవి. మొన్నీమధ్యన కూడా రాజశేఖర్‌, చిరంజీవి అభిమానులు గతంలో తనపై దాడి చేసిన విషయమై ఒకింత ఆవేదన వ్యక్తం చేయడం, సినిమాల్లో పవన్‌కళ్యాణ్‌ తనను ర్యాగింగ్‌ చేయడం బాధకలిగిందని చెప్పడం తెల్సిన విషయాలే. వివాదాలు తగ్గలేదు.. అలాగని, సంబంధాలూ తగ్గిపోలేదు.. ఇదో టైపు ‘బంధం’ అనుకోవాలంతే.


Recent Random Post: