
పెద్ద పాత నోట్ల రద్దు (డిమానిటైజేషన్) పుణ్యమా అని బ్యాంకింగ్ రంగం బాగా కోలుకుందన్నది మెజార్టీ బ్యాంకులు చెబుతున్నమాట. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు కూడా.! నిజానికి, కేవలం పెద్ద నోట్ల రద్దుతోనే బ్యాంకులకు ఊరట కలిగిందని చెప్పలేం. ఇతరత్రా చాలా కారణాలున్నాయి బ్యాంకులు కొంత మేర ఉపశమనం పొందాయని చెప్పడానికి. అందులో ముఖ్యమైనది, పెరిగిన ఛార్జీల వ్యవహారం.!
ఒకప్పుడు బ్యాంకుల మధ్య పోటీ చాలా తీవ్రంగా వుండేది. అదీ నగదు ఉపసంహరణకు సంబంధించి ఏటీఎంలకు వెళ్ళి, డబ్బుల్ని ఎడా పెడా తీసేసుకోవడానికి వీలుండేది. ఇప్పుడు ఏటీఎంల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాంతో, బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకోవాల్సి వస్తోంది. ఓ పక్క ఏటీఎంల నిర్వహణ వ్యయం బాగా తగ్గడం, ఇంకోపక్క బ్యాంకుల్లో నగదు లావాదేవీలు పెరిగిపోవడం, దానికి తోడు ఛార్జీల వడ్డన వెరసి బ్యాంకులకు ఓ రేంజ్‌లో పండగే అవుతోందిప్పుడు.
బ్యాంకుల్లో డబ్బులు వేస్తే ఛార్జీలు, తీస్తే ఛార్జీలు.. మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో వడ్డనలు.. ఇంకా ఇతరత్రా లావాదేవీలపై వాతలు.. వెరసి, బ్యాంకింగ్ రంగం కనీ వినీ ఎరుగని రీతిలో వినియోగదారుడ్ని దోచేస్తున్నప్పుడు, బ్యాంకులకు లాభం చేకూరకుండా వుంటుందా.? దేశంలో గతంలో ఎన్నడూ లేని సరికొత్త దోపిడీ ఇది. వినియోగదారుడి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైపోయింది. పెద్ద పాత నోట్ల రద్దుతో సామాన్యుడికి కలిగిన ‘మహా గొప్ప భాగ్యం’ ఇదే.!
నల్లధనం ఏమయ్యింది.? తీవ్రవాదం సంగతేంటి.? అవినీతిని అంతమొందించారా.? లేదా.? వంటి ప్రశ్నలకు కేంద్రం వద్ద సమాధానం లేదు. దాంతోపాటుగా, పెద్ద పాత నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్థమయిపోయింది. ఈ పరిస్థితుల్లో బ్యాంకులకు ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చేసి, నరేంద్రమోడీ సర్కార్ చేతులు దులిపేసుకుంది. ఆ ఫలితమే, ఈ వాత.!
పెద్ద పాత నోట్ల రద్దుతో బ్యాంకులపై ఒకప్పుడు పెరిగిన ఒత్తిడి కారణంగా పలువురు బ్యాంకు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. క్యూలైన్లలో సామాన్యుల జీవితాల గురించి మాట్లాడుకోవడమెందుకు.? సామాన్యుడి గోల ఏ ప్రభుత్వానికీ, ఏ బ్యాంకుకీ పట్టదు కదా.! తమ డబ్బుని బ్యాంకుల్లోంచి తీసుకోడానికే బిచ్చగాళ్ళలా మారాల్సి వచ్చింది. అన్ని కష్టాలు పడితే, బ్యాంకులకి పండగ.. సామాన్యుడికేమో వాత.! అదిరిందయ్యా నరేంద్రమోడీ.! పెద్ద పాత నోట్ల రద్దుకు ఏడాది పూర్తవుతున్న సమయంలో సంబరాలు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. నిజమే, బ్యాంర్లు, పాలకులు పండగే చేసుకోవాలి. ఎందుకంటే, ఏడాది క్రితం జనాన్ని చావగొట్టేశారు కదా తమ వెకిలి, మూర్ఖపు నిర్ణయాలతో.
Recent Random Post: