‘పోరు భారతం’లో ఉపకథ

మహాభారతంలో అసలు కథ కౌరవ, పాండవుల యుద్ధం అయినప్పటికీ అనేక ఉప కథలున్నాయి. దేని ప్రత్యేకత దానిదే. అసలు కథ వెంట ఈ కథలూ సాగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం మహాభారతం అనుకుంటే ఇతర పార్టీలూ, సంఘాలు, కొందరు వ్యక్తులు చేస్తున్న పోరాటాలను ఉప కథలుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రజాస్వామ్య యుద్ధంలో ఆయుధాలు, కత్తులు కటార్లు ఉండవు కాబట్టి వివిధ వేదికలపై విమర్శలతో, కోర్టు కేసులతో యుద్ధం చేస్తున్నారు. ఈ ఉప కథల్లో ఆసక్తికరమైంది ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం మాజీ ఛైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు చేస్తున్న పోరాటం.

కోర్టులో పోరాటం ఫలిస్తుందా?

ప్రస్తుతం ఆయన పోరాటం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) పనితీరుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేసేదాకా వెళ్లింది. బ్రాహ్మణ సంఘం ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించిన రోజు నుంచే సర్కారుపై ఆయన పోరాటం ప్రారంభమైంది. ప్రభుత్వం ఆయనపై ఎందుకు కత్తిగట్టిందో తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా మారిందని, రాజకీయ కార్యాలయంగా పనిచేస్తోందనేది కృష్ణారావు ఆరోపణ. ఇది సచివాలయానికి సమాంతరంగా వ్యవహరిస్తూ దాన్ని డామినేట్‌ కూడా చేస్తుండటంతో సచివాలయానికి విలువ లేకుండా పోయిందని హైకోర్టులో వేసిన పిల్‌లో పేర్కొన్నారు.

సీఎంవోను బాధ్యతాయుతంగా పనిచేసేలా సంస్కరించాలని కోర్టును కోరారు. ఐవైఆర్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కాబట్టి సీఎంవో గురించి పూర్తి అవగాహన ఉంది. ఈ కార్యాలయం ఎలా పనిచేయకూడదో, ఎలా పనిచేయాలో తెలుసు. ముఖ్యంగా ఏపీ సీఎంవోలో ఎలాంటి ఫైళ్లూ లేవనేది ఐవైఆర్‌ ఆరోపణ. ఈ విషయాన్ని ఆయన సమాచార హక్కు చట్టం ద్వారా కనుక్కున్నారు. గవర్నర్‌ కార్యాలయంలో, ప్రధానమంత్రి కార్యాయలంలో (పీఎంవో) సైతం ఫైళ్లు నిర్వహిస్తుండగా ఈ కార్యాలయంలో అదేమీ లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.

జగన్‌ మనిషిగా ముద్ర

కృష్ణారావు రాజకీయాల్లో చేరతారో లేదో తెలియదుగాని జగన్‌ మనిషిగా టీడీపీ ముద్ర వేసింది. జగన్‌ను పాపాత్ముడిగా చిత్రీకరిస్తున్న ‘పచ్చ’ పార్టీ ఐవైఆర్‌ను కూడా పాపాత్ముడిగా ప్రచారం చేసింది. జేసీ దివాకర్‌రెడ్డి అనేకసార్లు టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాని ఏం చేయలేరు. ఎందుకు? రాజకీయంగా నష్టం జరుగుతుంది కాబట్టి. జేసీ మాట్లాడిందంతా ఆయన సొంత అభిప్రాయాల కింద బాబు తేలిగ్గా తీసుకున్నారు.

ఎంపీ శివప్రసాద్‌ బాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఏం చేశారు? చింతమనేని ప్రభాకర్‌ పెద్ద రౌడీలా వ్యవహరిస్తున్నా ఎలాంటి చర్యలూ లేవు. ఇలా చెప్పుకుంటూపోతే చాలా కథలున్నాయి. తెలుగులో ఓ సామెత ఉంది. ‘కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కు అని పేరు పెట్టాలి’ అని. ఐవైఆర్‌ కృష్ణారావును ఇలాగే చేసింది చంద్రబాబు సర్కారు. అవమానకరంగా పదవి నుంచి తొలగించింది.

ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆ సామాజికవర్గానికే చెందిన ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌తో తిట్టించింది. వివిధ బ్రాహ్మణ సంఘాలకు చెందిన పలువురు చిన్నాచితకా నాయకులూ విమర్శించారనుకోండి. టీడీపీ నాయకులకు ఇంతటితో కసి తీరలేదు. కృష్ణారావు మీద రంగు చల్లితేగాని లాభం లేదనుకున్నారు. ఆయన వైఎస్సార్‌సీపీకి అనుకూలుడని, అందులో చేరాలని చూస్తున్నారని అన్నారు. టీడీపీ అనుకూల పత్రిక ‘ఆంధ్రజ్యోతి’ కృష్ణారావుపై రాసిన విశ్లేషణలోనూ ఆయన మొదటినుంచి వివాదాస్పదుడేనని తేల్చింది.

భజన చేయలేను

చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా పొలిటికల్‌ మైలేజ్‌ కోరుకున్నారని, తాను అందుకోసం సాధ్యమైనంతగా కృషి చేశానని కృష్ణారావు చెప్పారు. ప్రతి సమావేశంలోనూ కార్పొరేషన్‌ ప్రాధాన్యత, దాని ద్వారా కల్పించే ప్రయోజనాలు, చంద్రబాబు ఉదారత మొదలైనవి వివరించేవాడినని, లబ్ధిదారులకు చంద్రబాబు చేత లేఖలు ఇప్పించానని, ఇంతకు మించి మైలేజ్‌ ఎలా ఇవ్వాలో తనకు తెలియదని, అదేపనిగా భజన చేయలేనని ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించాక ఐవైఆర్‌ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆంధ్రజ్యోతి విశ్లేషణలో ఇందుకు భిన్నంగా ఉంది.

తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ పెట్టి, రమణాచారిని అధ్యక్షుడిగా నియమించగానే బ్రాహ్మణులు కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు, పూజలు చేశారని, ఆంధ్రలో కనీసం చంద్రబాబు పేరు కూడా తలచుకోలేదని రాసింది. ఏపీ బ్రాహ్మణులు అలా చేయకపోవడం ఐవైఆర్‌ తప్పవుతుందా? కృష్ణారావును తొలగించడానికి ఫేస్‌బుక్‌లో పోస్టింగులు ఓ కారణమైవుండొచ్చుగాని ఆయన సీఎస్‌ కాగానే రాజధాని కోసం ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడుతూ సీఎంకు లేఖ రాశారు. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతం సుభిక్షమైన వ్యవసాయ భూములు కాబట్టి దొనకొండ మంచిదన్నారు.

బహుశ ఇలా చెప్పడం బాబుకు ఆగ్రహం కలిగించివుండొచ్చు. వాస్తవానికి శివరామకృష్ణన్‌ కమిటీ కూడా దొనకొండ ప్రాంతాన్ని సూచించింది. అయితే కృష్ణారావు ప్రకాశం జిల్లాకు చెందినవాడు కాబట్టి దొనకొండను సూచించారని, రాజధాని తన జిల్లాకు రావాలనుకున్నారని టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. దీంతో బాబుకు-ఐవైఆర్‌కు విభేదాలు మొదలయ్యాయని అనుకోవచ్చు. అందుకే రాజధాని ప్రాంతం గురించి నిజాలు తెలియచేస్తూ పుస్తకం రాస్తానన్నారు.

రాజధాని వెనక నిజాలు చెబుతారా?

బ్రాహ్మణ కార్పొరేషన్లో టీడీపీ నాయకుల ఆధిపత్యం పెరిగిపోయిందని , తద్వారా కృష్ణారావు ఇబ్బంది పడ్డారని అర్థమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలవల్ల కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలే ప్రయోజనం పొందాలని, ప్రతిపక్షాలకు చెందినవారికి ఎలాంటి మేలూ చేయకూడదని అధికారులపై, వివిధ కార్పొరేషన్లపై ప్రభుత్వం, టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టమైంది.

ఇక రాజధాని నిర్మాణ వ్యవహారాల గురించి ప్రజలకు ఆంధ్రా ప్రజలకు నిజాలు తెలియడంలేదని ఐవైఆర్‌ చెప్పింది వాస్తవం. సీఎస్‌గా పనిచేసిన ఈయనకు రాజధానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసు. సహజంగానే ఏ అధికారి దగ్గరైనా (రాష్ట్రంగాని, కేంద్రంగాని) ప్రభుత్వానికి సంబంధించిన కీలక విషయాలు చాలా ఉంటాయి. సర్వీసులో ఉండగా వాటి గురించి మాట్లాడకూడదు. కాబట్టి కొందరు అధికారులు ఉద్యోగ విరమణ చేశాక తమ అనుభవాలను పుస్తకాలుగా రాస్తారు. అయితే సాధారణంగా వివాదాస్పద విషయాల జోలికిపోరు.

కృష్ణారావు కూడా సజావుగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ అధ్యక్ష పదవి నుంచి రిటైర్‌ అయ్యుంటే గమ్మున ఉండేవారే. చంద్రబాబు తనను అవమానించడంతో రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక విషయాలు బహిర్గతం చేయాలనుకుంటున్నారు. ఆయన ఆవేశంలో అన్నారో, సీరియస్‌గా చెప్పారో తెలియదుగాని బయటపెడితేమాత్రం ఏపీలో పెను సంచలనం ఖాయం. ఏనాటికైనా నిజాలు బయటపెడతారా?


Recent Random Post: