
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భుజస్కంధాల మీద మరో కీలకమైన బాధ్యత పడింది. ఏపీలో బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటున్న బాబుకు అనేక సమస్యలతో ఊపిరి ఆడని పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ పేరుతోనూ మోసం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రం అప్పులకుప్పగా మారింది. ఆర్థిక కష్టాలు అదరగొడుతున్నాయి. అద్భుత అమరావతి నిర్మాణం చేయలేక సతమతమవుతున్నారు.
చెప్పుకునే గొప్పలకు తగినట్లుగా పరిస్థితి లేదు. మరోపక్క ఏడాదిన్నరలో ఎన్నికలొస్తున్నాయి. అన్ని పనులు ఒక్కడే మీదేసుకొని చేసే అలవాటున్న చంద్రబాబు ఏటికి ఎదురీదుతున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మరో కీలకమైన బాధ్యత కూడా ఆయన మీదనే పడింది. అదే తెలంగాణలో పార్టీని రక్షించుకోవడం, దానికి గత వైభవం సాధించుకోవడం. గత వైభవం సంగతి అటుంచితే ఉనికిని కాపాడుకుంటే చాలు. దానికైనా చాలా కృషి చేయాలి.
రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తరువాత మొదటిసారిగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వచ్చిన చంద్రబాబు నాయుడు నాయకులు, కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి కారణంగా కొన్నిరోజులుగా గందరగోళంగా మారిన పార్టీలో మళ్లీ జవసత్వాలు నింపేందుకు నాంది పలికారు. వాస్తవానికి ఫ్లాప్ అవుతుందని, రసాభాస అవుతుందని ఊహించిన ఈ సమావేశం ఉత్సాహపూరిత వాతావరణంలో జరగడం నాయకులకే ఆశ్చర్యం కలిగించింది.
పార్టీని రక్షించుకోవాలనే కసితో ఈ సమావేశం నిర్వహించినట్లు పలువురు పాత్రికేయులు చెప్పారు. అదలావుంచితే, తెలంగాణలో పార్టీ అభివృద్ధికి సమయం కేటాయిస్తానని, ప్రతి నెలా ఇక్కడికే వచ్చి సమీక్షలు జరుపుతానని, వీలైనన్ని ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటానని చెప్పారు. గతంలో తాను తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయించలేనని, ఏపీలోని బాధ్యతలతో టైమ్ సరిపోవడంలేదని, తెలంగాణ నాయకులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేవారు. కాని తాజా సమావేశంలో అందుకు భిన్నంగా చెప్పారు.
ప్రతి నెలా హైదరాబాదుకు రావడం, వీలైనన్ని ఎక్కువ రోజులు ఇక్కడే ఉండటం సాధ్యమా? ఏపీలో ఇప్పుడున్న పరిస్థితిలో ఇలా చేయడం సాధ్యం కాకపోవచ్చు. తెలంగాణలో విపరీతంగా కష్టపడతారనే అనుకుందాం. దాని ఫలితంగా నాలుగైదు స్థానాలు దక్కవచ్చేమో. అంతే తప్ప అధికారమైతే రాదు కదా. తెలంగాణలో కష్టపడుతూ ఏపీని నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. అంటే అధికారం చేజారే ప్రమాదముంటుంది.
ఏవిధంగా చూసినా బాబుకు తెలంగాణ కంటే ఏపీయే ప్రధానం. ఆయన రాజకీయ జీవితం, కుమారుడి భవిష్యత్తు ఆ రాష్ట్రంతోనే ముడిపడి ఉన్నాయి. ఒకప్పుడు తెలంగాణ టీడీపీ నాయకులు లోకేష్‌కు ఈ రాష్ట్రం బాధ్యతలు అప్పగించాలని కోరారు. అప్పటికి ఆయన మంత్రి కాలేదు. కొందరు భక్తులైతే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబేనన్నారు. ఏ లాజిక్‌తో అన్నారో తెలియదుగాని చివరకు పార్టీ ఉనికికే ముప్పొచ్చింది.
రేవంత్ గందరగోళం చేస్తున్నప్పుడు లోకేష్ మూడు రోజులు హైదరాబాదులో ఉండి కూడా పార్టీ కార్యాలయానికి వచ్చే సాహసం చేయలేదు. గతంలో చంద్రబాబు పార్టీలో ‘సమన్వయ కమిటీ’ ఏర్పాటు చేశారు. దానికి సర్వాధికారాలతో లోకేష్‌ను బాధ్యుడిని చేశారు. అప్పటికాయన మంత్రి కాలేదు. ఈ కమిటీ పార్టీ వ్యవహారాలనే కాకుండా, ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను, మంత్రుల పనితీరును కూడా సమీక్షిస్తుందని చెప్పారు. ఈ కమిటీకి తెలంగాణ శాఖ వ్యవహారాలు చూసే బాధ్యత కూడా అప్పగించడంతో లోకేష్ నాయకులతోనూ సమావేశం జరిపారు.
ఆయన మంత్రి అయ్యాక ఆ కమిటీ గురించి తెలియరాలేదు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో తెలంగాణ కమిటీని బాబు చూసుకోవల్సిందే తప్ప మరో మార్గం లేదు. కుమారుడికి ఆ సామర్థ్యం లేదు. ఇప్పుడైతే తెలంగాణ టీడీపీని ముందుకు నడిపించే తెలంగాణ నేత లేడు. ప్రస్తుత అధ్యక్షుడు రమణకు మంచివాడనే పేరున్నా నాయకత్వ సామర్థ్యం లేదనే అభిప్రాయముంది. రేవంత్ రెడ్డి వంటి నాయకుడు తయారైతే బాబు ఊపిరి పీల్చుకోవచ్చు.
Recent Random Post:

















