
అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటిదాకా అక్కడ ఒక్కటంటే ఒక్క శాశ్వత అధికారిక నిర్మాణమూ ప్రారంభం కాలేదు. తాత్కాలిక సచివాలయం పేరుతో పరిపాలనా ప్రాంగణం నిర్మించేసి, అదే రాజధాని అనుకోమంటున్నారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. గట్టిగా వర్షం కురిస్తే చాలు, ఆ తాత్కాలిక పరిపాలన ప్రాంగణంలో నీళ్ళు ఎక్కడి నుంచి లీక్ అయిపోతాయో ఎవరికీ తెలియని గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొంటోంది.
ఇక, తాజాగా చంద్రబాబు విదేశాల్లో పర్యటించి వచ్చారు. లండన్‌లో నార్మన్ ఫోస్టర్స్ సంస్థ ప్రతినిథులతో రాజధానికి సంబంధించి అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లను ఖరారు చేయడానికి వెళ్ళిన చంద్రబాబు, తిరిగొచ్చి ‘అసెంబ్లీ మినహా మిగతా డిజైన్లు ఖరారయినట్లే..’ అని సెలవిచ్చారు. అసెంబ్లీ డిజైన్ ఖరారు కావడానికి ఇంకో 40 రోజుల సమయమైనా పడ్తుందని చంద్రబాబు చెప్పడం గమనార్హం.
మొన్నీమధ్యన.. అంటే, దసరాకి ముందే డిజైన్లు ఖరారైపోతాయనీ, దసరా పండక్కి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయనీ మంత్రి నారాయణ సహా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు మంత్రులు చెప్పుకొచ్చారు. దసరా వచ్చి, వెళ్ళిపోయింది. దీపావళి కూడా దాటేసింది. ఇప్పుడేమో, చంద్రబాబు సంక్రాంతి భజన చేస్తున్నారు. సంక్రాంతికి అటూ ఇటూగా రాజధాని నిర్మాణాలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు చంద్రబాబు.
ఇంత దారుణమా.? 2018 సంక్రాంతికి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైతే, ఏడాది లోపే, రాజధాని తొలి దశ నిర్మాణం ఎలా పూర్తవుతుందట.? అసలు 2018 సంక్రాంతి.. అంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్ని ఎంతవరకు విశ్వసించగలం.? అమరావతి కాదది, ప్రస్తుతానికి భ్రమరావతి మాత్రమే.! ప్రస్తుతానికేంటి, గడచిన రెండేళ్ళుగా ఇదే పరిస్థితి.
Recent Random Post:

















