బాలయ్య సినిమాను ఇంకా ఆడిస్తున్నారు

సినిమాల అర్ధశత దినోత్సవాలు.. శతదిత్సవాలు.. సిల్వర్ జూబ్లీల గురించి మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా.. మూడు వారాల తర్వాత థియేటర్లలో ఉండట్లేదు. ఆ తర్వాత ఏదో నామమాత్రంగా ఆడుతుందంతే. 50 రోజులు వచ్చేసరికి సినిమా అడ్రస్ ఉండటం లేదు. ఆ సమయానికి సినిమా టీవీల్లోకో.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లోకో వచ్చేస్తోంది. రెండు మూడు వారాలు దాటితే జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉండటం లేదు. వాస్తవం ఇలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు కూడా కొందరు హీరోల అభిమానులు అర్ధశత దినోత్సవాల్ని.. శతదినోత్సవాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ అభిమానుల ప్రత్యేకతే వేరు. బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ‘లెజెండ్’ను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 500 రోజులకు పైగా ఆడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ చిత్రం 1000 రోజుల పైగా ఆడింది. ఇది ఎలా సాధ్యమైందో వివరాలు చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఎమ్మిగనూరులో బాలయ్య ప్రతి సినిమానూ ఇలాగే ఆడిస్తుంటారు. ‘జై సింహా’కు కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తున్నారు.

సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అక్కడ ఇంకా ఆడుతోంది. ఆ చిత్రం 70 రోజులకు చేరువవుతోంది. వంద రోజులు పక్కాగా ఆడించాలని చూస్తున్నారు. ఆ తర్వాత కూడా కొనసాగినా ఆశ్చర్యం లేదేమో. ఐతే ఈ చిత్రం ఈ ఒక్కచోటే కాదు.. చిలకలూరి పేటలో కూడా ఒక థియేటర్లో ‘జైసింహా’ ఆడుతుండటం విశేషం. ఫ్యాన్స్ ఈ విపరీత అభిమానాన్ని ఇంకా ఎన్నాళ్లు కొనసాగిస్తారో?