చరణ్ ఎదిగాడు.. ఆ షాటే నిదర్శనం

టాలీవుడ్లో పెద్ద స్టార్లుగా ఎదిగిన వాళ్లందరిలోకి నటుడిగా చరణ్‌ను కొంచెం తక్కువగానే చూస్తారు జనాలు. ‘మగధీర’.. ‘ఆరెంజ్’.. ‘ధృవ’ లాంటి సినిమాల్లో చరణ్ తన తన ప్రతిభను చూపించినప్పటికీ.. నటుడిగా మెజారిటీ జనాల్లో అతడిపై పాజిటివ్ ఇంప్రెషన్ లేని మాట వాస్తవం. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి వాళ్లతో పోలుస్తూ అతడిని సోషల్ మీడియాలో అతడిని ట్రోల్ చేస్తూ ఉంటారు జనాలు. ఒక దశలో ‘రచ్చ’.. ‘నాయక్’.. ‘బ్రూస్ లీ’ లాంటి రొడ్డకొట్టుడు సినిమాలు చేయడం ద్వారా చరణ్ నెగెటివిటీని పెంచుకున్నాడు. ఐతే ‘ధృవ’తో ఆ నెగెటివిటీని కొంచెం తగ్గించుకుని.. క్లాస్ ప్రేక్షకుల్లోనూ కొంత యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నాడు.

‘ధృవ’ తర్వాత క్లాస్‌లో ఫాలోయింగ్ మరింత పెంచుకునేందుకు, నటుడిగా మరో మెట్టు ఎక్కేందుకు తెలివిగా సుకుమార్‌తో జత కట్టాడు రామ్ చరణ్. తనతో పని చేసిన ఏ నటుడినైనా.. సరికొత్తగా ఆవిష్కరిస్తాడు సుక్కు. అల్లు అర్జున్ దగ్గర్నుంచి ఎన్టీఆర్ వరకు సుక్కుతో సినిమా చేసిన ప్రతి ఒక్కరూ మేకోవర్ అయ్యారు. నటుడిగా పరిణతి సంపాదించారు. చరణ్ కూడా ఆ కోవలోకే చేరాడని ‘రంగస్థలం’ టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమైంది.

టీజర్‌తోనే ఇంప్రెస్ చేసిన చరణ్.. ట్రైలర్‌తో మెస్మరైజ్ చేసేశాడు. బాడీ లాంగ్వేజ్, నటన, హావభావాలు, డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతి విషయంలోనూ కొత్తగా, పక్కాగా కనిపించాడు. ఎక్కడా ఏదీ ఎబ్బెట్టుగా లేదు. ట్రైలర్ మొత్తంలో ఎన్నదగ్గ షాట్ అంటే.. ప్రెసిడెంటుగా జగపతిబాబు పరిచయం తర్వాత అతను వస్తుంటే భయంతో చరణ్ పక్కకు తప్పుకునే షాటే. అందులో చరణ్ వావ్ అనిపించేశాడంతే. అక్కడ హీరో చరణ్ ఎంతమాత్రం కనిపించలేదు. కేవలం చిట్టిబాబు మాత్రమే కనిపించాడు. మరి సినిమాలో చరణ్ ఇంకెంతగా ఇంప్రెస్ చేస్తాడో చూద్దాం.