
నగర పౌరులకు ఎంతో సౌకర్యంగా అనిపించే ఒక నిర్ణయాన్ని విజయవాడ నగరపాలక సంస్థ శుక్రవారం నాడు తీసుకుంది. నిజంగానే ప్రజల్లో చాలామంది ఇలాంటి నిర్ణయానికి జేజేలు పలుకుతారని అనడంలో సందేహం లేదు. కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం చొరవతో ఈ నిర్ణయం సాకారం అయింది. అయితే.. ఇలాంటి నిర్ణయం భాగ్యనగరంలో కూడా అమల్లోకి వస్తుందా? అని ప్రజలు ఎదురుచూడడంలో తప్పేమీలేదు. ఎటూ రెండు తెలుగు రాష్ట్రాలూ ఒకరిని చూసి మరొకరు ప్రజోపయోగ పనుల విషయంలో ముందుకు సాగుతున్నారు గనుక.. బెజవాడలో మాదిరిగానే.. హైదరాబాదులో కూడా ఇలాంటి నిర్ణయాన్ని కేసీఆర్ సర్కారు తీసుకుంటే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.
ఇంతకూ ఏమిటా నిర్ణయం అనుకుంటున్నారు కదా.? బెజవాడ సినిమా థియేటర్లలో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింకులను ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని కలెక్టరు నిర్ణయించారు. ఇలాంటి స్పష్టమైన ఉత్తర్వులు లేకపోవడం మూలాన.. సినిమా థియేటర్లు ప్రధానంగా మల్టిప్లెక్స్ లలో ఎంత దారుణంగా ప్రేక్షకులను దోచేస్తూ ఉంటారో మనకు తెలుసు. పైగా మన ఇళ్లనుంచి మనం వాటర్ బాటిల్స్ తీసుకువెళ్తే లోపలకు అనుమతించరు. అక్కడేమో మన తాహతుకు మించిన ధరలకు నీళ్ల సీసాలు అమ్ముతుంటారు. ఈ పెడపోకడకు కృష్ణాజిల్లా కలెక్టర్ అడ్డుకట్ట వేశారు. ప్రేక్షకులు తమ సొంత బాటిల్స్ కూడా థియేటర్ కు తీసుకువెళ్లవచ్చునని ఆదేశించేశారు.
అయితే.. హైదరాబాదు నగరంలో కూడా ఇలాంటి విచ్చలవిడి దోపిడీ కొనసాగుతూనే ఉంది. అనునిత్యం వేలాది మంది ప్రజలు ఇలాంటి దోపిడీకి బలవుతూనే ఉన్నారు. పైగా భాగ్యనగరంలో ఆధునిక యువతరంతో పాటూ మిడిల్ క్లాస్ ప్రేక్షకులు కూడ పెద్దసంఖ్యలో మల్టిప్లెక్స్ లకు వెళుతున్నారే తప్ప.. సాధారణ థియేటర్లకు తాకిడి తగ్గింది. ఈ క్రేజ్ ను మల్టిప్లెక్స్ లు దారుణంగా దోచుకోడానికి వాడుకుంటున్నాయి.
ఎటూ ప్రజల విషయాల్లో తరచుగా స్పందిస్తూ ఉండే.. మంత్రి కేటీఆర్ పట్టణాభివృద్ధి శాఖను తానే చూస్తున్నారు గనుక.. ఇలాంటి నిర్ణయం వచ్చేలా చూస్తే మంచిదని ప్రేక్షకులు కోరుతున్నారు. కేటీఆర్ తలచుకుంటే చాలు.. ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం అమల్లోకి వస్తుందని.. ప్రేక్షకలోకం.. సంతోషిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అలాంటి నేపథ్యంలో కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Recent Random Post:

















