భిన్నంగా స్టార్ట్ అయిన క‌మ‌ల్ పొలిటిక‌ల్ జ‌ర్నీ

ఆయ‌న సినిమాలు మిగిలిన వారికి భిన్నంగా ఉంటాయ‌న్న పేరుంది. అంచ‌నాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ఊహించ‌ని పాత్ర‌ల్ని పోషించ‌టం మొద‌ట్నించి అల‌వాటున్న విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌.. తాజాగా త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీని కూడా ఆదే తీరులో షురూ చేశారు. గ‌డిచిన కొద్దికాలంగా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లుగా చెప్పేసిన ఆయ‌న‌.. ఈ రోజు ఉద‌యం త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీని మొద‌లెట్టేశారు.

విల‌క్ష‌ణ న‌టుడ‌న్న పేరుకు త‌గ్గ‌ట్లే.. త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీని విల‌క్ష‌ణంగా మొద‌లెట్టిన ఆయ‌న ఈ రోజు (బుధ‌వారం) ఉద‌యం 8 గంట‌ల వేళ‌లో మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం సొంతూరు రామేశ్వ‌రం చేరుకున్నారు. అక్క‌డాయ‌న క‌లాం సోద‌రుడు మ‌హ‌మ్మ‌ద్ ముతుమీర లెబ్బాయ్‌కు చేతి వాచీని కానుక‌గా ఇచ్చారు.సాదాసీదాగా నివ‌సించ‌టంలో గొప్ప‌త‌నం ఉంద‌ని.. క‌లాంటి లాంటి గొప్ప వ్య‌క్తి పుట్టిన రామేశ్వ‌రం నుంచి త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీని షురూ చేయ‌టం సంతోషంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. క‌లాం బ్ర‌ద‌ర్ కు వాచీ బ‌హుక‌రించిన త‌ర్వాత మ‌త్స్య కారుల‌తో భేటీ అయిన క‌మ‌ల్‌.. ప‌ది గంట‌ల వేళ‌లో ప్రెస్ మీట్‌కు హాజ‌ర‌య్యారు.

అన్నింటిక‌న్నా కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ రోజు సాయంత్రం ఆరు గంట‌ల వేళ‌కు మ‌ధురై చేరుకునే క‌మ‌ల్‌.. అక్క‌డ త‌న పార్టీ పేరును.. వివ‌రాల్ని వెల్ల‌డించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మ‌రో విశేషం ఏమిటంటే.. త‌న స్నేహితుడు.. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో పాటు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ హాజ‌రుకానున్న‌ట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాజకీయ పార్టీని క‌మ‌ల్ స్టార్ట్ చేస్తున్న వేళ‌.. ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఫోన్ చేసి అభినందించ‌టం గ‌మ‌నార్హం. మిగిలిన రాజ‌కీయ పార్టీల‌కు కాస్త భిన్నంగా క‌మ‌ల్ పార్టీ ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Recent Random Post: