మీ గురించి దక్షిణాది ఫీలింగ్ అదే.. మోడీజీ!

ఎన్నికల సందర్భం వచ్చినప్పుడెల్లా ప్రధాని నరేంద్రమోడీకి పూనకం వచ్చేస్తుంది. ఆయన జన రంజకంగా మాటలు తూటాల్లా పేర్చి ప్రత్యర్థులకు ఊపిరి సలపనివ్వకుండా విసురుతుంటారు. జనానికి కిక్ ఇచ్చే మాటలు వల్లించి.. కాస్త ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి మాటలకే తెలుగు ప్రజలు కూడా బుట్టలో పడ్డారు.
ప్రత్యేకహోదా ఇచ్చేస్తాం.. అనాథ రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేస్తాం అని మోడీ అంటే.. అందరూ అవును కాబోలు అనుకున్నారు. కానీ అది అంతా మాయే అని వారు గుర్తించలేకపోయారు. కానీ … ప్రస్తుతం గుజరాత్ లో జరిగిన సభలో మోడీ మాట్లాడుతున్న మాటలను గమనిస్తే… తెలుగు రాష్ట్రానికి ద్రోహం, ఆయన చూపిస్తున్న వివక్ష అన్నీ గుర్తుకు వస్తున్నాయి.

గుజరాత్ లో ఇప్పుడు ఎన్నికల ప్రస్తావన వచ్చేసరికి… ప్రధాని మోడీ కాంగ్రెస్ ముందరి కాళ్లకు బంధాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుజరాతీలంటే ఇష్టం లేదని.. గుజరాతీ ప్రముఖ నాయకులను (గాంధీ తప్ప) అందరినీ ఆ పార్టీ చిన్న చూపు చూసిందని మోదీ నిందలు వేస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ ను గుజరాతీలు తిరస్కరించాలనేది ఆయన కోరిక.

అయితే ప్రధాని నరేంద్రమోడీ గుర్తించాల్సిన సంగతి మరొకటి ఉంది. అచ్చంగా ఆయన కాంగ్రెస్ గురించి గుజరాతీల్లో ఎలాంటి భావాన్ని పాదుగొల్పడానికి ప్రయత్నిస్తున్నారో… అదే భావం మోడీ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఉంది. ఆ మాటకొస్తే దక్షిణాది రాష్ట్రాల వారందరికీ అదే భావన ఉన్నదన్నా ఆశ్చర్యం లేదు. ‘‘కాంగ్రెస్ కు గుజరాతీలంటే కంటగింపు’’ అని మోడీ ఏ రకంగా అయితే ప్రచారం చేస్తున్నారో.. సరిగ్గా అదే మాదిరిగా.. ‘‘మోడీకి, భాజపాకు దక్షిణాది రాష్ట్రాలంటే కంటగింపు’’ అని ఇక్కడి ప్రజలు కూడా భావిస్తున్నారు.

ఎన్ని రకాలుగా తెలుగు రాష్ట్రాల అభ్యున్నతి గురించి మాటలు చెప్పారో… ఆచరణలోకి వచ్చేసరికి ఎంత ఘోరంగా దారుణంగా వ్యవహరిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన మాట విషయంలోనే చూస్తున్నారు. కనీసం కేంద్ర కేబినెట్ లో ఒక్క మంత్రి కూడా లేని తెలంగాణ పరిస్థితి ఏమిటో అందరూ చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాను ప్రస్తుతం గుజరాత్ లో ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ గురించి చెబుతున్న మాటలను మోడీ.. ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడి ప్రజల్లో తన పట్ల , తన పార్టీ పట్ల అదే అభిప్రాయం లేకుండా ఉండడానికి ఏం చేయాలో ఆయన నిర్ణయించుకోవాలి.


Recent Random Post: