యువరాజు పట్టాభిషేకం మోడీ చేతుల మీదుగా.?

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ ‘యువరాజు’ రాహుల్‌గాంధీ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకింత ‘అనవసర రాద్ధాంతం’ చేస్తోందనే సంకేతాలు జనంలోకి గట్టిగా వెళ్ళిపోతున్నాయి. నిజానికి రాహుల్‌గాంధీ ఏనాడూ సీరియస్‌ పొలిటీషియన్‌గా వ్యవహరించింది లేదు. కానీ, ఇప్పుడు బీజేపీ రాహుల్‌గాంధీని పనిగట్టుకుని ‘యువరాజు’ని చేసి.. అతనికి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోంది.

‘పప్పు’ అంటూ గుజరాత్‌ ఎన్నికల కోసం రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ రూపొందించి విడుదల చేసిన వీడియో యాడ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడమే కాదు, అది వివాదాస్పదమయ్యింది కూడా. దాంతో, ఆ యాడ్‌లోని ‘పప్పు’ని తొలగించి ‘యువరాజు’ అంటూ సంబోదిస్తున్నారు. పేరేదైతేనేం, బీజేపీ తమ గొప్ప చెప్పుకోవడం మానేసి.. రాహుల్‌గాంధీని విమర్శించడం మీద ఎక్కువ ఫోకస్‌ పెడ్తోందన్నమాట.

‘పప్పు’ అనే కాన్సెప్ట్‌ విషయంలో రాహుల్‌గాంధీ మీద సోషల్‌ మీడియాలో ఒకప్పుడు స్పందన గట్టిగానే వచ్చింది.. అదీ బీజేపీకి అనుకూలంగా. అది గతం. ఇప్పుడు మారింది. మరీ అరగదీసేస్తే, ఏదైనాసరే బెడిసికొట్టేస్తుంది కదా.! ఇప్పుడు అదే జరుగుతోంది గుజరాత్‌లో. బీజేపీ, రాహుల్‌ మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టడం ద్వారా, రాహుల్‌ని మోడీ కంటే గొప్ప నాయకుడిగా ఆ పార్టీ భావిస్తున్నట్లయ్యిందనే అభిప్రాయాలు గుజరాత్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.

ఆ అభిప్రాయాల సంగతి పక్కన పెడితే, ఎన్నికల వేళ దేశంలో సరికొత్త.. అదీ చెత్త ‘పబ్లిసిటీ’ స్టంట్లు.. ఇలా వెర్రి తలలు వేయడం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అయినా, ఎన్నికల వేళ తమ గొప్ప గురించి చెప్పుకుంటూ ప్రకటనలు ఇవ్వడం మామూలే. ఇప్పుడిలా ఇతరుల్ని కించపర్చే ప్రకటనలతో దేశంలో ప్రజాస్వామ్యమే అపహాస్యం పాలవుతుందన్నది వారి వాదన. ఏమో.. పరిస్థితి ఇప్పుడే ఇలా వుంటే, 2019 ఎన్నికల నాటికి ఈ పబ్లిసిటీ పైత్యం ఇంకెంత ముదిరి పాకాన పడ్తుందో.!

కొసమెరుపు: మూడేళ్ళ క్రితం రాహుల్ ఇమేజ్ వేరు.. ఇప్పుడు రాహుల్ ఇమేజ్ వేరు. రాహుల్ ఇమేజ్ కాస్తో కూస్తో పెరగడానికి మోడీనే కారణం. మోడీ తీరు చూస్తోంటే, తన చేతుల మీదుగా రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.! అందుకు గుజరాత్ ఎన్నికల్లోనే బీజం పడిందనుకోవచ్చేమో.!


Recent Random Post: