
సాధారణంగా తాము నిర్మించిన చిత్రాన్ని నిర్మాతలు చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. అత్తెసరు సినిమా తీసి కూడా అద్భుతం తీసామని ఫీలయ్యే నిర్మాతలు ఎందరో కనిపిస్తారు. అలాంటిది రంగస్థలం చిత్రం ఎంత రేంజ్‌కి వెళ్లగలదనేది ఆ నిర్మాతలే అంచనా వేయలేకపోయారు. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్‌కి ఇచ్చిన నిర్మాతలు నలభై అయిదు రోజుల తర్వాత ఆన్లైన్లో పెట్టేసుకోవచ్చని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈమధ్య ఏ సినిమా అయినా రెండు, మూడు వారాలకి మించి ఆడడం లేదు కనుక ఇది కూడా అంతేనని మైత్రి మూవీస్ వాళ్లు భావించినట్టున్నారు. కానీ రంగస్థలం అంచనాలని మించిపోయి ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ సాధిస్తోంది. ఆదివారం, అంటే నలభై అయిదవ రోజున కూడా ఈ చిత్రానికి హౌస్‌ఫుల్స్ వచ్చాయి. మరికొద్ది గంటల్లో అమెజాన్ రిలీజ్ పెట్టుకుని హౌస్‌ఫుల్స్ వచ్చిన సినిమాని అంత త్వరగా ఆన్లైన్ రిలీజ్‌కి ఇచ్చేసిన నిర్మాతలని అభిమానులు తిట్టి పోస్తున్నారు. ఇంకా థియేట్రికల్ షేర్స్ వచ్చేవని, కనీసం పది వారాల వ్యవధి అయినా లేకుండా ఇలా థియేటర్లలో వున్న సినిమాని ఆన్లైన్లో పెట్టేయడం ఏమిటని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ చిత్రం బాగా ఆడడం చూసి ఆన్లైన్ రిలీజ్‌ని ఒక వారం అయినా వాయిదా వేయాలని నిర్మాతలు అమెజాన్‌ని కోరారట. అలా వీరికి వెసులుబాటు ఇస్తే ఇకపై ప్రతి డీల్ బ్రేక్ చేయాల్సి వస్తుందని, ముందుగా చేసుకున్న ఒప్పందంలో మార్పు వుండదని తెగేసి చెప్పారట. కనీసం భారీ చిత్రాలకి, పొటెన్షియల్ వున్న సినిమాలకి అయినా రైట్స్ పరంగా వచ్చే కొన్ని అదనపు లక్షల కోసం ఇలా ఆన్లైన్ రిలీజులని ఇంత త్వరగా పెట్టుకోకుండా వుంటే మంచిదని దీంతో ఇంకోసారి రుజువైంది.
Recent Random Post: