రంగస్థలం ముసుగులో టాలెంట్ ను తొక్కేద్దామా?

శివ నాగులు.. జానపదాలు ఫాలో అయ్యేవారికి ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. అడపాదడప సినిమాల్లో కూడా పాటలు పాడుతున్న ఈ గాయకుడు, రంగస్థలంలో కూడా ఓ పాట పాడాడు. ఆల్బమ్ లో ఆ పాట కూడా హిట్ అయింది. పాట ఏదో వెరైటీగా ఉంది, సినిమాలో ఇంకెంత బాగుంటుందో అని అంతా వెయిట్ చేశారు. అంచనాలకు తగ్గట్టే రంగస్థలం సినిమాలో ”ఆ గట్టునుంటావా” పాట సందర్భానుసారం బాగా క్లిక్ అయింది.అయితే ఆ పాటలో ఉన్న గొంతు మాత్రం శివ నాగులుది కాదు. ఆడియో ఆల్బమ్ లో ఉన్నది శివనాగులు వాయిసే. కానీ సినిమా దగ్గరకొచ్చేసరికి మాత్రం అతడి గొంతు మూగబోయింది. ఆ స్థానంలో ఎప్పట్లానే దేవిశ్రీప్రసాద్ గొంతు వినిపించింది. దీంతో శివనాగులుతో పాటు అతడి అభిమానులంతా అవాక్కయ్యారు.

కనీసం తనకు నామమాత్రంగానైనా చెప్పకుండా తన వాయిస్ ను తీసిపారేయడంతో జీర్ణించుకోలేకపోయాడు శివనాగులు. తన పాట వస్తుంది చూడండంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఘనంగా చెప్పుకున్నాడు. సినిమా చూసిన వాళ్లంతా వాయిస్ లేదని చెప్పడంతో షాకయ్యాడు. ఓ చర్చావేదికలో తన కడుపులో బాధ మొత్తాన్ని కక్కేశాడు.”రంగస్థలంలో ఆ గట్టునుంటావా అనే పాటను శివనాగులు పాడిండని చాలామంది నా అభిమానులు, ఫ్రెండ్స్ హ్యాపీగా థియేటర్లకు వెళ్లారు. తీరా సినిమాలో నా గొంతు లేకపోయేసరికి వాళ్లు చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఒక విధంగా చెప్పాలంటే నేను చచ్చిపోయాను.”

దేవిశ్రీకి మంచి ట్యూన్ సెట్ అయితే ఆ పాటను సింగర్స్ కు ఇవ్వడనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. ఇది ఇప్పటి మాట కాదు. దాదాపు 7-8ఏళ్లుగా దేవిశ్రీ తీరు ఇదే. మంచి పాటలు తనే పాడేస్తుంటాడు. కానీ ఇలా ఓ పాటను ఓ సింగర్ తో పాడించి, తర్వాత దాని స్థానంలో తన వాయిస్ ను పెట్టుకోవడం మాత్రం అనైతికం.రంగస్థలం మేనియా, మెగా మాయలో పడిపోయి ఇంత సెన్సిటివ్ మేటర్ ను చాలామంది పట్టించుకోవడం మానేశారు. తను పాడిన ఓ పాటను జ్యూక్ బాక్స్ లో ఉంచి, సినిమాలోంచి తీసేస్తే ఆ గాయకుడు ఎంత మానసిక క్షోభకు గురవుతాడో రంగస్థలం యూనిట్ తెలుసుకుంటే బాగుంటుంది. కనీసం ఆ విషయాన్ని సదరు గాయకుడికి ముందుగా చెప్పకపోవడం క్షమించరాని నేరం.

రంగస్థలంలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని పొగుడుతున్న అదే నోటితో శివనాగులుకు చిన్న సారీ చెబితే బాగుండేది. సారీ చెప్పడం మాట అటుంచి, తాము చేసిన పనిని సమర్థించుకోవడం మరీ పెద్ద నేరం.”ఆ పాట షూట్ చేస్తున్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ తోనే ఆడియో వచ్చింది. ఆ వాయిస్ తోనే సాంగ్ షూట్ చేసేశాం. తర్వాత ఆడియోను శివనాగులు పాడారు. శివనాగులు చాలా మెలొడియస్ గా పాడారు. కానీ దేవిశ్రీ వాయిస్ తో షూట్ చేయడం వల్ల ఎడిటింగ్ లో రామ్ చరణ్ తో లిప్ సింక్ కాలేదు. శివనాగులు వాయిస్ కి, రామ్ చరణ్ ఎక్స్ ప్రెషన్ కూడా కుదరలేదు. అందుకే శివనాగులు వాయిస్ తీసేశాం.”

కేవలం టెక్నికల్ సమస్య వల్లనే శివనాగులు వాయిస్ తీసేయాల్సి వచ్చిందంటున్నాడు సుకుమార్. తప్పనిసరి పరిస్థితుల్లో దేవిశ్రీ గొంతునే కొనసాగించాం అంటున్నాడు. ఓ సినిమా చేసే క్రమంలో టెక్నికల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు. అంతిమంగా దర్శకుడు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. కానీ తప్పు జరిగినప్పుడు సదరు టెక్నీషియన్ కు, మరీ ముఖ్యంగా ఓ జానపద కళాకారుడికి ఆ విషయం చెప్పకపోవడం కచ్చితంగా తప్పు. ఈ విషయాన్ని రంగస్థలం యూనిట్, మరీ ముఖ్యంగా మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ అంగీకరించి తీరాలి.


Recent Random Post: