
‘నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడంలేదు.. అయినా, ఇప్పుడు ఆ విషయంపై మాట్లాడేంత తొందర నాకు లేదు.. డిసెంబర్ 12న పార్టీ గురించి ప్రకటన చేస్తున్నానంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు..’ అంటూ ఇటీవలే సినీ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టతనిచ్చిన విషయం విదితమే.
ఇంతకన్నా స్పష్టత మామూలుగా అయితే ఇంకేమీ అవసరం లేదు. కానీ, రజనీకాంత్ నుంచి ఇంత క్లారిటీ వస్తున్నా, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం, ‘రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు, వచ్చేస్తున్నారు..’ అంటూ ప్రకటనలు గుప్పిస్తూనే వుండడం గమనార్హం. అభిమానుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలొస్తే వింతేమీ కాకపోవచ్చు. కానీ, కుటుంబ సభ్యుల నుంచి రజనీకాంత్ రాజకీయంపై ప్రకటనలు వస్తోంటే, వాటినెలా లైట్ తీసుకోగలం.?
ఇక్కడ రజనీకాంత్ పక్కా వ్యూహంతో ‘రాజకీయం’ నడుపుతున్నట్లే కన్పిస్తోంది. ‘ఇప్పుడా ఉద్దేశ్యం లేదు..’ అంటూ రాజకీయ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారాయన. పైకి మాత్రం, ‘అబ్బే, అదేం లేదు..’ అంటూ రజనీకాంత్ చెబుతున్నారని మనం అర్థం చేసుకోవాలేమో.! అసలంటూ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం రజనీకాంత్‌కి లేకపోతే, ముందుగా తన చుట్టూ వున్నవారిని ఆయన కంట్రోల్ చేయగలగాలి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని రాజకీయాల గురించి మాట్లాడకూడదని చెప్పగలగాలి. కానీ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న రజనీకాంత్, తాను మాత్రం జాగ్రత్తపడ్తున్నాడు. ఇదేం రాజకీయమో మరి.!
Recent Random Post: