
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు అప్పట్లోనే వార్తలొచ్చాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ, ఆ లేఖని చంద్రబాబుకే స్వయంగా రేవంత్ అందించారన్నది ఆ వార్తల సారాంశం. స్పీకర్ ఫార్మాట్లో రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖ కూడా మీడియాలో ప్రత్యక్షమయ్యింది. కానీ, అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ రాజీనామా వ్యవహారం ఓ సస్పెన్స్‌గానే వుంది తప్ప, లేఖ ఏమయ్యిందో మాత్రం ఎవరికీ తెలియడంలేదు.
తెలంగాణ స్పీకర్ కార్యాలయం రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ అందలేదని చెబుతోంది. రేవంత్, రాజీనామా చేసేశానని అప్పట్లో చెప్పడం తప్ప, అంతకు మించి ఆయన ఇప్పటిదాకా మళ్ళీ ఈ రాజీనామా వ్యవహారంపై పెదవి విప్పకపోవడం గమనార్హం. వీలు చిక్కినప్పుడల్లా రేవంత్ మీడియా ముందుకొస్తున్నారు. అధికార టీఆర్ఎస్పై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కీ సవాల్ విసురుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికపైనా సవాల్ విసిరేస్తున్నారు.
అసలంటూ, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి చేసిన రాజీనామా ఆమోదం పొందితేనే, కొడంగల్‌లో ఉప ఎన్నిక తలెత్తేది. రాజీనామా లేఖ, స్పీకర్‌కి రేవంత్ పంపారా లేదా? అన్నది మొదటి ప్రశ్న. పోనీ, చంద్రబాబు అయినా రేవంత్ తనకు ఇచ్చిన రాజీనామా లేఖని తెలంగాణ స్పీకర్‌కి పంపారా? అన్నది ఇంకో ప్రశ్న. స్పీకర్‌కి అందితే, ఆ రాజీనామాని స్పీకర్ ఆమోదిస్తారా లేదా? అనేది మరో ప్రశ్న.
తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చెబుతున్నదాన్ని బట్టి అసలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుకి రాజీనామా లేఖ ఇవ్వలేదని తెలుస్తోంది. అదే నిజమైతే, రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ పేరుతో పబ్లిసిటీ స్టంట్స్ చేశారనుకోవాలి.!
మొత్తమ్మీద, ఈ ‘రాజీడ్రామా’ వ్యవహారం రేవంత్‌రెడ్డిని నిత్యం వార్తల్లో వుంచుతోంది. అయినా, రేవంత్ ‘రాజీడ్రామా’పై ఎందుకు పెదవి విప్పడంలేదట.? ఫ్రీగా పబ్లిసిటీ వస్తున్నప్పుడు, దాన్ని పోగొట్టుకోవడమెందుకని రేవంత్, రాజీడ్రామా వ్యవహారంపై మిన్నకున్నారనుకోవాలా.?
Recent Random Post: