
రాజకీయ నాయకుల్లో ఎక్కువమంది అతితెలివిగాళ్లేననే విషయం తెలిసిందే. ‘మాకన్నా మా పనోళ్లులెండి’ అని ఓ సినిమాలో రాజేంద్రప్రసాద్ గారడీ చేస్తూ పాడతాడు. బుద్ధిమంతుడు, నీతినిజాయితీ ఉన్నోడని అనుకున్న రేవంత్ రెడ్డి కూడా కనికట్టు చేశాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఆ తానులోని ముక్కేనని మీడియా సమాచారాన్నిబట్టి తెలిసిపోయింది. ఈయన టీడీపీ నుంచి వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకున్న తరువాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చేంతవరకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూపించారు.
ఆయన వచ్చాక అమరావతికి వెళ్లి పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖ బాబు కార్యాలయంలో ఇచ్చారు. అదే సమయంలో కొడంగల్ ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేశానని ప్రకటించి స్పీకర్‌కు పంపే ఆ లేఖను మీడియాకు చూపించారు. దీంతో చంద్రబాబు వ్యతిరేకులు రేవంత్‌ను ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు నైతిక విలువలను తుంగలో తొక్కి ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించలేదని, ఆయనకు చెంపపెట్టులా రేవంత్ వెంటనే రాజీనామా చేశాడని ప్రశంసించారు. కొడంగల్ ఉప ఎన్నికల్లో తనను ఎవ్వరూ ఓడించలేరని, టీఆర్ఎస్ను మట్టికరిపిస్తానని రేవంత్ రెడ్డి వీరత్వాన్ని ప్రదర్శించారు.
కాని అసలు విషయమేమిటంటే ఆయన రాజీనామా లేఖ స్పీకరుకు ఇప్పటివరకు చేరలేదు. లేఖ ఇప్పటివరకు అందలేదని స్పీకర్ కార్యాలయం ఇదివరకే తెలిపింది. ఇలా చెప్పాక కూడా రేవంత్ రెడ్డి దీనిపై మాట్లాడిన దాఖలాలు లేవు. స్పీకర్ కార్యాలయం చెబుతున్నది వాస్తవం కాకపోతే దాన్ని ఖండించాలి కదా. ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రకారం..రేవంత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన లేఖను, స్పీకర్ ఫార్మట్‌లో రాసిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను కూడా చంద్రబాబు కార్యాలయంలో అందించారు.
ఆ లేఖను నేరుగా స్పీకరుకు పంపాలి కదా. చంద్రబాబు తనకు బీఫామ్ ఇచ్చారు కాబట్టి రాజీనామా లేఖ ఆయన ద్వారానే స్పీకరుకు పోవాలని రేవంత్ భావించారట. మరి బాబు కార్యాలయం నుంచి లేఖ తెలంగాణ స్పీకరుకు వెళ్లనట్లుగా ఉంది. రేవంత్ పైకి రాజీనామా చేసినట్లు ‘కలర్’ ఇచ్చారా? నిజంగా రిజైన్ చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజీనామా విషయంలో పట్టుదలకు పోకూడదని, రేవంత్ మీద ఒత్తిడి తేకూడదని కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుకుంటోంది. కొడంగల్‌లో ఉప ఎన్నిక జరిగి టీఆర్ఎస్ గెలిచినట్లయితే ఆ విజయం సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి బాగా ఉపయోగపడుతుంది. అందుకే రాజీనామా గురించి ఏ కాంగ్రెసు నాయకుడూ మాట్లాడటంలేదు.
కొడంగల్ ఉప ఎన్నిక జరగకపోవచ్చు అని మాజీ మంత్రి డీకే అరుణ చేసిన వ్యాఖ్యను రేవంత్ రాజీనామా లేఖను ఇవ్వలేదనే విషయం బలపరుస్తోంది. అరుణ మరో విషయం కూడా చెప్పారు. కొడంగల్‌కు ఉప ఎన్నిక నిర్వహించాల్సివస్తే టీడీపీ, కాంగ్రెసు, వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సివస్తుంది. రేవంత్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే విజయం సాధించడానికి టీఆర్ఎస్ భారీగా కసరత్తు చేస్తుందని, సర్వశక్తులు ఒడ్డుతుందని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. అంటే ఆ పార్టీని తట్టుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నమాట. సో…రేవంత్ కూడా అందరు ఫిరాయింపుదారుల్లో ఒకడిగా మిగిలిపోయాడు.
Recent Random Post:

















