వాళ్ళెవరో వైఎస్‌ జగన్‌కి తెలిసిపోయిందా.?

పార్టీ ఫిరాయించడానికి వైఎస్సార్సీపీలో కొంతమంది సిద్ధంగా వున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తమ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు వుంటాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గతంలోనే అంచనా వేశారు. అయితే, ఇక్కడ చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చెప్పాలి. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మొదలైతే, ఆ టైమ్‌లో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలన్నది చంద్రబాబు స్కెచ్‌.

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు రంగం సిద్ధమవుతోంది. నవంబర్‌ 2 నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపడ్తారు. కోర్టు అనుమతి కోసం ఆల్రెడీ కోర్టులో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఇక, పాదయాత్ర ప్రారంభమవుతూనే పార్టీ ఫిరాయింపుల ద్వారా జగన్‌కి షాకివ్వాలని చంద్రబాబు స్కెచ్‌ ప్రిపేర్‌ చేసేశారు. ఆ స్కెచ్‌ గురించి ముందస్తు సమాచారం వైఎస్‌ జగన్‌కీ లీక్‌ అయ్యింది.

ఇకనేం, ‘బ్లాక్‌ షీప్స్‌’ వ్యవహారంపై వైఎస్‌ జగన్‌ కూడా ఓ అవగాహనకు వచ్చేశారు. ఎవరెవరు పార్టీ మారుతున్నారన్న విషయమై గత కొద్ది రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో సమాచారం తెప్పించుకున్న వైఎస్‌ జగన్‌, వాళ్ళందరికీ ‘పొమ్మనకుండా పొగపెట్టేస్తున్నార’ని చెప్పక తప్పదు. ముందుగా ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుకతో షురూ అయ్యింది. లిస్ట్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా వున్నారన్నది వైఎస్సార్సీపీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.

మామూలుగా అయితే, ఇలాంటి సందర్భాల్లో పార్టీ వీడాలనుకున్న నేతల్ని బుజ్జగించాల్సి వుంటుంది. కానీ, బుజ్జగించే స్టేజ్‌ ఎప్పుడో దాటేశారనీ, ఆల్రెడీ టీడీపీతో టచ్‌లోకి వెళ్ళిపోయిన ఆ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం మొదలు పెట్టారు గనుక, ముందుగానే వారి బండారం బయటపెట్టాలన్నది వైఎస్‌ జగన్‌ వ్యూహం. ఆ వ్యూహం ప్రకారమే ఈ రోజు సాక్షిలో ‘పొమ్మనకుండా పొగపెట్టడం’ అనే కార్యక్రమం షురూ అయ్యిందనుకోవాలి. నవంబర్‌ 2 లోపు మిగతా ‘బ్లాక్‌ షీప్స్‌’ వ్యవహారంపై కథనాలు రానున్నాయట.

పాదయాత్ర మొదలు పెట్టాక పార్టీ ఫిరాయింపులు షురూ అయితే, పాదయాత్రపై ఆ ఇంపాక్ట్‌ గట్టిగా పడ్తుంది కాబట్టి, ఈ విషయంలో వైఎస్‌ జగన్‌ వ్యూహం కరెక్టేనన్నది వైఎస్సార్సీపీ శ్రేణుల వాదన. ఇంతకీ, ఐదుగురు ఎమ్మెల్యేల లెక్క పక్కాయేనా.? ఎవరా ఐదుగురు ఎమ్మెల్యేలు.? వేచి చూడాల్సిందే.


Recent Random Post: