
సల్మాన్ కు కేసుల తలనొప్పులు ఈనాటికి కావు. ఇరవై సంవత్సరాల నుంచి సల్మాన్ ను ఇవి వెంటాడుతూనే ఉన్నాయి. కృష్ణ జింకలను వేటాడిన కేసుతోనే సల్మాన్ కు ఈ బెడద మొదలైంది. ఇది 1998 నుంచి వెంటాడుతున్న కేసు కాగా, ఇక కారు ప్రమాదం కేసు మరోటి. నిర్లక్ష్యపూరితంగా కారును నడిపి పేవ్ మెంట్ మీద నిద్రిస్తున్న వారి మరణానికి కారణం అయ్యాడనే కేసు సల్మాన్ ను చాన్నాళ్ల పాటు వేటాడింది. అయితే ఈ కేసులో సల్మాన్ దోషిగా తేలలేదు ఇప్పటి వరకూ. అయితే నల్లజింకల కేసు మాత్రం సల్లూను వదల్లేదు.
రెండు జింకలను వేటాడటం.. ఆ కాసేపటికి సల్మాన్ కు వినోదమే అనిపించి ఉండవచ్చు కానీ, ఇప్పుడు అదే అతడి జీవితంలో పెను విషాదంగా మారుతోంది. ఇరవై సంవత్సరాల పాటు విచారణను ఎదుర్కొనడం ఒకఎత్తు అయితే, ఐదేళ్ల శిక్ష మరోఎత్తు. అయితే ఇదే ఫైనల్ కాదు. సల్మాన్ ఈ కేసుపై విచారణను కోరుతూ పై కోర్టుకు వెళ్లవచ్చు. సల్మాన్ కు తక్షణం బెయిల్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.
పై కోర్టుకు అప్పీల్ కు వెళుతున్నారు కాబట్టి.. ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసేశారు. మరోవైపు సల్మాన్ పై దాదాపు ఆరువందల కోట్ల రూపాయల వ్యాపారం ఆధారపడి ఉందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘రేస్ 3’ సినిమా షూటింగ్ పార్టును దాదాపు పూర్తి చేసుకుంది. డబ్బింగ్ పనులున్నాయి. ఈద్ సందర్భంగా ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. సల్మాన్ ఇప్పుడు జైల్లో గనుక మిగిలిపోతే ఈ సినిమా మీదే గట్టిదెబ్బ పడేది.
దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా అది. ఇక దబంగ్ 3, భరత్, కిక్ 2 సినిమాలు అనౌన్స్ అయి ఉన్నాయి. అయితే ఇవేవీ ఇంకా భారీ పెట్టుబడుల వరకూ రాలేదు. కానీ సల్మాన్ ఎన్నాళ్లు జైల్లో ఉండాల్సి ఉంటుందనే దాన్ని ఈ సినిమాలపై ప్రభావం ఉంటుంది. ఇక సల్మాన్ టీవీ షోల దందా కూడా భారీగానే ఉంది. ప్రత్యేకించి త్వరలోనే ‘దస్ కా దమ్’ పున:ప్రారంభం కానుందని ప్రకటించారు. స్థూలంగా సల్మాన్ గనుక ఇప్పుడు జైలు శిక్షను పూర్తిగా అనుభవించాల్సి వస్తే.. పరిశ్రమపై నాలుగు నుంచి ఆరు వందల కోట్ల రూపాయల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.అయితే సల్మాన్ బెయిల్ పై బయటకు వస్తే వ్యాపారం యథాతథంగా సాగవచ్చు.
Recent Random Post: