
పదవి అంటే అదొక బాధ్యత. అందుకే పదవిలో వున్నవారెవరైనా హుందాగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు పాలకుల నుంచి హుందాతనాన్ని ఆశించి భంగపడాల్సి వస్తోంది. ‘కొంచెం సంస్కారం ప్రదర్శించండి..’ అంటూ మొత్తుకోవాల్సి వస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఇప్పుడు చాలామంది సంస్కారం ఆశిస్తున్నారు. ఆయన్నుంచి హుందాతనాన్ని కోరుకుంటున్నారు.
ఉద్యమ నేతగా కేసీఆర్ ఎలా నోరు పారేసుకున్నా పెద్దగా అభ్యంతరాల్లేకుండా నడిచిపోయింది. విపక్షాల్ని విమర్శించేటప్పుడు కేసీఆర్ ఏ భాష అయినా ఉపయోగించొచ్చుగాక.. అది రాజకీయమని సరిపెట్టుకోవచ్చు. నిజానికి, అక్కడా అలా సరిపెట్టుకోవడానికి వీల్లేదు. ఓ ముఖ్యమంత్రి ఇంత నీఛమైన భాష మాట్లాడతాడా.? అని జనం ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. కానీ, ఏం చేస్తాం.? ఆయన భాష అంతే. పైగా, ‘మా తెలంగాణలో గింతే’ అని కేసీఆర్ బుకాయించగలరు.!
ఇక, అధికారిక పర్యటనలో భాగంగా ఇటీవల సిరిసిల్ల వెళ్ళిన కేసీఆర్, అక్కడ తాను మాట్లాడుతుండగా పవర్‌కట్ అవడంతో సంయమనం కోల్పోయినట్టున్నారు. విద్యుత్ శాఖ అధికారుల్ని పట్టుకుని ‘సన్నాసులు’ అనేశారు. తెలంగాణలో ఎక్కడా పవర్ కట్స్ లేవన్నది కేసీఆర్ ఉవాచ. ‘ఎక్కడా లేని పవర్ కట్స్ ఇక్కడెందుకు.? అంటే, ఇక్కడ మంచోళ్ళు, పనిచేసేటోళ్ళు లేరన్నమాట.. సన్నాసులు ఉన్నారన్నమాట.. ఆ సన్నాసుల్ని సరిచెయ్యాలె’ అంటూ కేసీఆర్ అలా అలా మాట్లాడుకుంటూ పోయేసరికి, జనం ముక్కున వేలేసుకున్నారు. మామూలుగా అయితే, కేసీఆర్ మాటలకి ఓ రేంజ్‌లో రెస్పాణ్స్ వచ్చేది.. అది మంచి మాట అయినా, చెడ్డ మాట అయినా. ఈసారి చిత్రంగా సైలెన్స్ దర్శనమిచ్చింది. దానర్థం, కేసీఆర్ తన హుందాతనం చెడగొట్టుకున్నట్టే కదా.!
‘సన్నాసులు’ అన్న మాట కేసీఆర్ నోట చాలా సులువుగా వచ్చేస్తుంటుంది. ఒక్కోసారి అన్పిస్తుంటుంది ‘సన్నాసులు’ అన్న తిట్టుకి, ఆయన పేటెంట్ హక్కులేమన్నా పొందేశారా? అని.! ఒక్కటి మాత్రం నిజం, కేసీఆర్ తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే, ముఖ్యమంత్రి అనే పదవి తాలూకు స్థాయిని దిగజార్చేసినట్లవుతుంది. రాజకీయ వేదికలపై తిట్టుకోవడానికి రాజకీయ నాయకులకు ఛాన్స్ వుండనే వుంది. అధికారిక కార్యక్రమాల్లో ఏంటీ రచ్చ.?
యువత రాజకీయాల్లోకి రావాలంటూ వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే రాజకీయ నాయకులు, యువతకు ఈ తరహా తిట్లతో ఏం సంకేతాలు పంపుతున్నట్లు.? ఓ ముఖ్యమంత్రి, అధికారుల్ని ఉద్దేశించి ఇంత నీఛంగా మాట్లాడితే, ప్రజలకు అధికారుల పట్ల గౌరవమెలా వుంటుంది.? అందుకేనేమో, తెలంగాణలో ఎమ్మెల్యేలలు మహిళా కలెక్టర్లను అసభ్యకరంగా తాకుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మొత్తమ్మీద, ముఖ్యమంత్రిగారూ కాస్తంత హుందాతనం ప్లీజ్ అని జనం కోరుకుంటున్నారు.. మరి ఆ హుందాతనం కేసీఆర్ నుంచి ఆశించగలమా.?
Recent Random Post:

















