
అయ్యో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. అయ్యయ్యో అనిత.. పాపం బాబూ రాజేంద్రప్రసాద్.. ఇలా చాలామంది టీడీపీ నేతలు గొంతు చించేసుకున్నారుగానీ, చంద్రబాబు గాలి తీసేశారు. ‘అతి’ చెయ్యొద్దంటూ క్లాస్ తీసేసుకోవడంతో సోమిరెడ్డి, అనిత పరువు పోగొట్టుకున్నట్లయ్యింది. వీళ్లిద్దరే కాదు, ఇంకా చాలామంది టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అయినా, ‘కందకు లేని దురద డాష్ డాష్‌కి ఎందుకు’ అన్నట్లు, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విషయమై సోమిరెడ్డి, అనిత, ప్రభాకర్చౌదరిల హడావిడి ఏంటట.?
‘వెన్నుపోటు’ ఉదంతాన్ని హైలైట్ చేసి, తన గుట్టుని రామ్‌గోపాల్ వర్మ రట్టు చేస్తారేమోనని చంద్రబాబు భయపడాలి. ఆయన కుమారుడూ కాస్తో కూస్తో ఆందోళన చెందాలి. అటు చినబాబు నారా లోకేష్ ఎప్పుడో లైట్ తీసుకున్నారు. తాజాగా చంద్రబాబు కూడా ‘అతి’ చేయొద్దంటూ క్లాస్ తీసుకున్నారాయె. దాంతో, టీడీపీ నేతలకే షాక్ తగిలింది.
సమన్వయ కమిటీ భేటీ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు చంద్రబాబు దృష్టికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విషయాన్ని తీసుకెళ్ళారు. వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందనీ, వైఎస్సార్సీపీ నేత రాకేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనీ చంద్రబాబుకి చెబితే, ‘ఈ సినిమాపై అతిగా స్పందించాల్సిన అవసరం లేదు.. ఆ సినిమాకి అసలు ప్రాధాన్యత ఇవ్వొద్దు..’ అని చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు.
‘ఎన్టీఆర్ చరిత్ర అందరికీ తెలిసినదే.. వక్రీకరిస్తే జనం నమ్మరు..’ అన్నది చంద్రబాబు ఉవాచ. వక్రీకరించడానికి ఏముందిక్కడ.? స్వర్గీయ ఎన్టీఆర్ మీద చెప్పులు పడ్డాయి.. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆయన్ని దూరం చేసింది చంద్రబాబు అండ్ టీమ్. చంద్రబాబుని ‘జామాత దశమ గ్రహ’ అంటూ సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్ కంటతడి పెడుతూ తిట్టిన తిట్ల తాలూకు వీడియోలు ఇప్పటికీ అందుబాటులో వున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడనీ, దుర్మార్గుడనీ ఎన్టీఆర్ చెప్పిన విషయాల్ని ఎలా మర్చిపోగలం.? అవన్నీ చాలాసార్లు చాలా ఎన్నికల్లో ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవేవీ, చంద్రబాబుని రాజకీయంగా ఇబ్బంది పెట్టలేకపోయాయనుకోండి.. అది వేరే విషయం. బహుశా, అదే చంద్రబాబు ధీమా కూడా అయి వుండొచ్చు.
మొత్తమ్మీద ఈ ఎపిసోడ్లో చంద్రబాబు మెప్పు పొందేందుకు టీడీపీ నేతలు పాకులాడి, ఇప్పుడు చంద్రబాబు ఆగ్రహాన్ని చవిచూశారన్నమాట. నిజమే మరి, వర్మతో కెలుక్కుంటే సినిమా ఇంకోలా వుంటుంది. సినిమా వచ్చాక పరిస్థితి దేవుడికే ఎరుక. ఈలోగా వర్మ సోషల్ మీడియాలో ఇచ్చే కౌంటర్లకు టీడీపీ పరువు పోతుంది. అందుకేనేమో, చంద్రబాబు ఒకింత జాగ్రత్తపడ్డారు. టీడీపీ నేతల ‘అతి’పై హెచ్చరికలు జారీ చేశారు.!
Recent Random Post:

















