
తెలంగాణ తెలుగుదేశం నాయకులకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. రేవంత్ రెడ్డి తమ పార్టీని వీడిపోయి.. ప్రజల్లో తమ ఇమేజిని తీసిపారేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో ఏదో నష్ట నివారణ చేసుకోవడానికి అన్నట్లుగా వారు ఓ అయిడియా వేశారు. రేవంత్ నియోజకవర్గంలోనే తమ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియజెప్పాలనుకున్నారు. ఎటూ రేవంత్ రాజీనామా నేపథ్యంలో ఉపఎన్నిక వస్తే.. ఎవరిసత్తా ఏమిటో తేలిపోతుంది గదా అని మనకు అనిపిస్తుంది.
కానీ.. ఉప ఎన్నికలకు ఆరునెలల గడువు ఉంటుంది. మార్చి 29లోగా అంటే అయిదు నెలలు ముగిసేలోగా ఉపఎన్నిక జరగకపోతే.. కొడంగల్ లో తామే ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తాం అని.. తెరాస, కాంగ్రెస్ లకంటె ఎక్కువ ఓట్లు తెచ్చుకుని.. అక్కడ తమకే ప్రజాబలం ఉన్నదని చాటుకుంటాం అని వారంటున్నారు. ఒక రకంగా తెలంగాణ నేతలకు వచ్చిన ఈ ప్రజాబ్యాలెట్ ఐడియా బాగానే ఉంది.
అయితే ఇదే ఆలోచనను ఏపీలో చంద్రబాబునాయుడు ఎందుకు అమలు చేయలేరు? రాష్ట్ర ప్రజలందరినీ వంచిస్తూ ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఇప్పటికీ ఎన్ని బుకాయింపు మాటలు చెబుతున్నారో అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అని.. నంద్యాల ఎన్నికల్లో విజయం ద్వారా ప్రజలు ప్రత్యేకహోదా అవసరం లేదంటూ తీర్పు ఇచ్చారని ఇలా చంద్రబాబు ఎన్ని రకాల అబద్ధాలు చెబుతున్నారో ప్రజలకు తెలుసు!
తాము చెబుతున్న వాదన నిజమైనదే అని చాటుకోవడానికి తెలంగాణ తెలుగుదేశం నాయకులు ప్రజాబ్యాలెట్ ను ఆశ్రయిస్తాం అని డాంబికంగా పలుకుతున్న చందంగానే.. ఏపీలో చంద్రబాబునాయుడు కూడా తాను చెబుతున్నట్లు ప్రత్యేకహోదాను ప్రజలు ఛీ కొడుతున్నారు అనేది నిజంగా నమ్మితే గనుక.. ప్రజాబ్యాలెట్ నిర్వహించి నిరూపించవచ్చు కదా అని ప్రజలు దెప్పి పొడుస్తున్నారు.
నిజానికి ప్రత్యేకహోదా దక్కితే.. అందరి కంటె ఎక్కువ లాభం జరిగేది చంద్రబాబునాయుడుకే. ఆయన ఇలా కాళ్లరిగేలా.. విమానాలు అరిగేలా.. పెట్టుబడులకోసం పారిశ్రామికవేత్తలను బతిమాలుతూ దేశాలుపట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. మనవద్దకే పారిశ్రామికవేత్తలు ఎగబడి వస్తారు. అయితే అలాంటి అద్భుతమైన దానిని గాలికొదిలేసి.. ఆ విషయంలో రాష్ట్రప్రయోజనాల్ని సాంతం తాకట్టు పెట్టేసి.. ఇక అభివృద్దికోసం తాను ఏం చేస్తున్నానని చెబితే మాత్రం ప్రజలు ఎలా నమ్మగలరు? అందుకే ప్రత్యేకహోదాను ప్రజలు మరచిపోయారో లేదో తేల్చుకోడానికి ఓ ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తే బాగుంటుందనే మాట ఇప్పుడు- తె.తెదేపా పుణ్యమాని పలువురి నుంచి వినిపిస్తోంది.
Recent Random Post:

















