
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తరఫున ఓ ప్రకటన బయటకొచ్చింది. పెద్ద పాత నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తయిన సందర్బంలో ఈ ప్రకటని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ జారీ చేసింది. ఆ ప్రకటన సారాంశమేంటంటే, 125కోట్లమంది భారతీయులు నల్లధనానికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారని.
గడచిన ఏడాది కాలంలో జమ్మూకాశ్మీర్‌లో రాళ్ళ దాడులు తగ్గాయట. 17లక్షలకు పైగా అక్కౌంట్లకు సంబంధించి లావాదేవీలు సరిగ్గా ‘మ్యాచ్’ కాలేదట. తీవ్రవాదంతోపాటు, నక్సలిజంపైనా ఉక్కుపాదం మోపడం సాధ్యమయ్యిందట. భారత ఆర్థిక వ్యవస్థని ‘క్లీన్’ చేయడం జరిగిందట. మెరుగైన ఉద్యోగాల కల్పనకు అవకాశం దొరికిందట.
ప్రకటనలు ఇలాగే వుంటాయ్.! పైగా, అక్కడున్నది నరేంద్రమోడీ. 2014ఎన్నికల సమయంలో ప్రధాని కాకముందు నరేంద్రమోడీ, బ్లాక్ మనీ గురించి ఏం చెప్పారు.? విదేశాల్లోని మగ్గుతోన్న మన నల్లధనాన్ని వెలికి తీస్తామనీ, నల్ల కుబేరుల్ని జైలుకి పంపుతామనీ చెప్పారు కదా.! మరి, ఆ నల్లధనం వచ్చిందా.? నల్ల కుబేరులెవరైనా జైలుకు వెళ్ళారా.? లేదు కదా.!
పన్ను చెల్లింపుదారులు పెరగడం, డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరగడం.. ఇదే అభివృద్ధి అనుకోవడమంటే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటుండదు. మొత్తంగా 125కోట్ల మంది భారతీయులూ నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడిందే నిజమైతే, అసలు నల్లదొంగలు ఎవరు.? ఈ ప్రశ్నకు నరేంద్రమోడీ సమాధానం చెప్పాల్సి వుంది.
ఓ పక్క దేశంలోకి కనీ వినీ ఎరుగని రీతిలో ఉగ్రవాదుల చొరబాట్ల యత్నాలు జరుగుతున్నాయనీ, ఇంకోపక్క జమ్మూకాశ్మీర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయనీ సాక్షాత్తూ అధికారిక లెక్కలే చెబుతోంటే, ‘పెద్ద నోట్ల రద్దుకి ఏడాది’ ప్రకటనలో మాత్రం, అందుకు భిన్నంగా కేంద్రం కొత్త వాదనను తెరపైకి తెస్తుండడం ఆశ్చర్యకరమే.
టీటీడీ సభ్యుడిగా పనిచేసిన శేఖర్‌రెడ్డి సహా, ఎంతోమంది నల్లకుబేరులకు 2వేల రూపాయల నోట్ల కట్టలు ఎలా వెళ్ళాయి.? గడచిన ఏడాది కాలంలో దేశంలో అవినీతి విపరీతంగా ఎందుకు పెరిగిపోయింది.? అసలు 125కోట్ల మందిలో సామాన్యులెవరు.? నల్ల దొంగలెవరు.? దేశంలో వున్న నల్లధనమెంత.? వెలికి వచ్చిన నల్లధనం లెక్కలేమిటి.? కొత్తగా తెలుపు రంగు అద్దుకున్న నల్ల ధనం సంగతేంటి.? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి, దేశ ప్రజానీకాన్ని ‘ఉబ్బేసేందుకు’ ఘనంగా ప్రకటన ఇచ్చుకున్న నరేంద్రమోడీ సర్కార్‌ని చూస్తే నవ్వురాకుండా వుండదు. ఇదో దండగ ఖర్చు తప్ప, ఈ ప్రకటనతో ఒరిగేదేమీ లేదు.
Recent Random Post: