
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుపై వామపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆరోపణలకు ఆమడంత దూరం ఉంటూ వస్తున్న వెంకయ్యను టార్గెట్ చేస్తూ నిన్న సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వెంకయ్య కుటుంబం ఆధ్వర్యంలోని స్వర్ణభారతి ట్రస్టుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయించాలని కూడా ఆయన ఏకంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ లేఖ రాశారు.
స్వర్ణభారతి ట్రస్టుకు.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో దాదాపుగా 8 ఎకరాల విస్తీర్ణంలో భారీ భవంతులు వెలసిన విషయం తెలిసిందే. వెంకయ్య కుమార్తు నేతృత్వంలో నడుస్తున్న ఈ సంస్థ ఇటీవలి కాలంలో తన కార్యకలాపాలను బాగానే విస్తరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అసలు ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్టుకు 8 ఎకరాల భూములు ఎలా దక్కాయి? స‌్వర్ణభారతి భూమిలో ఏ ఎకరం మేర గ్రామ కంఠం భూమి ఉన్న మాట వాస్తవం కాదా? ఎవరి పేరిట ఈ భూములు కొన్నారు? స‌్వర్ణభారతి ట్రస్టులో ఎవరెవరు భాగస్వాములున్నారు? ప‌్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పేర్లను వినియోగించుకుని వెంకయ్య క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారనే అనుమానాలు బలపడుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ క్రమంలో స్వర్ణ భారతి ట్రస్టు వ్యవహారానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోదీ కేబినెట్లో కీలక స్థానం దక్కించుకున్న వెంకయ్య… ఆ తర్వాతే స్వర్ణభారతి ట్రస్టును తన కుమార్తె పేరిట ఏర్పాటు చేశారని, ఈ క్రమంలోనే ప్రజలకు ఈ వ్యవహారంపై అనుమానాలు బలపడుతున్నాయని, వీటిని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కూడా ఆయన డిమాండ్ చేశారు. మరి రామకృష్ణ డిమాండ్‌పై చంద్రబాబు సర్కారు ఏమంటుందో చూడాలి.
Recent Random Post: