పవన్‌ది జనసేన… మరి మహేష్‌ది?

సినిమా తార ముదిరితే రాజకీయవేత్త అవుతాడనేది నానుడి. అందుకు తగ్గట్టే చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేసారు. అయితే అందరు తారలు రాజకీయాల వైపు వెళ్లాలని లేదు. కొందరికి ఆ సబ్జెక్ట్‌ మీదే అసలు ఇంట్రెస్ట్‌ వుండకపోవచ్చు. అలాంటి వారిలో తానూ ఒకడినంటున్నాడు మహేష్‌బాబు.

పవన్‌కళ్యాణ్‌ జనసేన పెట్టినట్టు మీరేదైనా పార్టీ పెడతారా లేక పార్టీలో చేరతారా అనే ప్రశ్నకి బదులిస్తూ తనకి రాజకీయాలపై అవగాహన అసలు లేదని, తనకి తెలిసింది సినిమా ఒక్కటేనని, ఎప్పటికీ నటిస్తూనే వుంటాను తప్ప రాజకీయాల్లోకి వెళ్లనని మహేష్‌ ఇంకోసారి తెగేసి చెప్పాడు. మహేష్‌ తండ్రి కృష్ణ ఎంపీగా చేసారు. ఇప్పుడు తన బావ గళ్లా జయదేవ్‌ కూడా ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన ఫ్యామిలీలో రాజకీయాల పట్ల ఆసక్తి వున్నప్పటికీ తనకి మాత్రం దాని గురించి తెలిసింది సున్నా అని మహేష్‌ పేర్కొన్నాడు. భవిష్యత్తులోను తాను అడుగు పెట్టని రంగం ఏదైనా వుంటే అది ఇదేనని స్పష్టం చేసాడు.

హీరోలు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి అందరూ బురద జల్లుతూనే వుంటారు. గతంలో ఏమో కానీ ఈమధ్య రాజకీయాల్లోకి వచ్చి రాణించిన తారలెవరూ లేరు. ఈ నేపథ్యంలో మహేష్‌దే ఉత్తమమైన నిర్ణయమేమో. పూలు వేయించుకున్న చోటే రాళ్లు వేయించుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాదు కదా!


Recent Random Post: