
ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని.. వజ్రంతోనే కోయాలి. మరి.. తూటాల్లాంటి మాటలతో.. తమను దుమ్మెత్తిపోసిన తెలంగాణ అధికారపక్షంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రియాక్ట్ కావాలని భావిస్తోంది? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. ఏపీ ముఖ్యమంత్రి.. పార్టీ అధినేత చంద్రబాబుతో ఏపీలో సమావేశమైన తెలంగాణ తెలుగు తమ్ముళ్లు.. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహం మీద చర్చించారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
మే 27 నుంచి 29 వరకు విశాఖలో జరిగే పార్టీ మహానాడుకు ముందు తెలంగాణ వ్యాప్తంగా ఏమేం కార్యక్రమాలు చేపట్టాలన్న అంశంపై ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఇటీవల కాలంలో తెలంగాణ అధికారపక్షం తరఫున మంత్రి కేటీఆర్ పెడుతున్న భారీ బహిరంగ సభలకు ధీటుగా.. వారు ఎక్కడైతే సభల్ని నిర్వహించారో.. అక్కడే సభల్ని నిర్వహించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
ఇటీవల కాలంలో కేటీఆర్ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని.. అందుకు బదులుగా.. తెలంగాణ అధికారపక్షం ఎక్కడైతే సభల్ని నిర్వహించిందో అక్కడే తాము కూడా సభల్ని నిర్వహించి.. ప్రజల పట్ల.. రైతుల పట్ల టీడీపీకి ఉన్న కమిట్ మెంట్ ఏమిటో అర్థమయ్యేలా చెబుతామంటున్నారు. ఈ నెల 28న తాండూరులోతర్వాత సిద్దిపేట.. పాలేరు.. సిరిసిల్లలలో సభల్ని నిర్వహించనున్నట్లుగా చంద్రబాబుకు తమ్ముళ్లు చెప్పారు. ప్రజా పోరు పేరిట నిర్వహించే సభల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతామని చెప్పారు.
గతంలోని పది జిల్లాల్ని జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని.. పార్టీలో సమస్యల్ని పరిష్కరించాలని.. నియోజకవర్గాల వారీగా ఉన్న ఇష్యూలను సెట్ చేయాలనితెలంగాణ తెలుగుదేశం నేతలకు బాబు సూచించినట్లుగాచెబుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుందని.. తెలంగాణలో కూడా అది ఉంటుందని చెప్పిన ఆయన.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల్లో పొత్తులపై సమయం చూసుకొని చర్చిద్దామని.. పొత్తులముచ్చట ఎప్పటికప్పుడు మాట్లాడే అంశం కాదని.. ఎన్నికలకు ముందు మాట్లాడితే ఫలితం ఉంటుందన్నారు.
మే 10 నుంచి 20 మధ్య మిని మహానాడుల్ని నిర్వహించి.. నియోజకవర్గాల్లో సమస్యల్ని చర్చించి.. తీర్మానాలు చేయాలని.. విశాఖలో జరిగే మహానాడులోఈ అంశాలపై చర్చలు జరపాలని టీడీపీ నేతల్ని చంద్రబాబు కోరినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై తమ్ముళ్లకు చంద్రబాబు మార్గదర్శనం చేసిన నేపథ్యంలో.. వారెలా రియాక్ట్ అవుతారో.. వారిపై బాబు ఎంత ప్రభావితం చేశారో రానున్న రోజులు చెప్పేస్తాయని చెప్పక తప్పదు.
Recent Random Post: