
బాహుబలి సినిమా ‘ది కంక్లూజన్’తోనే ముగిసిపోతుందని.. కానీ బాహుబలి ప్రపంచం మాత్రం కొనసాగుతుందని ముందు నుంచే చెబుతూ వస్తున్నాడు రాజమౌళి. దాని ప్రకారం ‘బాహుబలి’లోని ప్రధాన పాత్రలకు సంబంధించిన బ్యాక్ స్టోరీస్‌తో పుస్తకాలు తయారవుతున్నాయి. ఆల్రెడీ ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ మార్కెట్లోకి వచ్చింది. ఈ కోవలోనే మరికొన్ని పుస్తకాలు రానున్నాయి.
ఇంకా టీవీ సిరీస్.. వెబ్ సిరీస్.. వీఆర్ వీడియోస్.. ఇలా రకరకాల మార్గాల్లో ‘బాహుబలి’ ప్రపంచాన్ని కొనసాగించడానికి సన్నాహాలు చేస్తున్నాలు నిర్మాతలు. ఐతే ఇవి ఎన్ని ఉన్నా.. వెండితెర మీద బాహుబలి అద్భుతాలు చూడ్డానికే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారనడంలో సందేహం లేదు.
ఈ నేపథ్యంలో ‘బాహుబలి’కి కొనసాగింపుగా మరో సినిమా వస్తే బాగుంటుందన్న ఫీలింగ్ జనాల్లో ఉంది. ఐతే ఈ అవకాశాన్ని పూర్తిగా ఏమీ కొట్టిపారేయలేం. ‘ది కంక్లూజన్’ చివర్లో ఓ పిల్లాడు మహేంద్ర బాహుబలి కొడుకు మాహిష్మతికి తర్వాతి రాజవుతాడా అని అడిగితే.. ”ఏమో ఎవరికి తెలుసు. అంతా శివేచ్ఛ” అంటూ తనికెళ్ల భరణి వాయిస్ వినిపిస్తుంది. ఇది ‘బాహుబలి-3’కి నాంది అని జనాలు అనుకుంటున్నారు. ఎందుకైనా మంచిదని జక్కన్న అండ్ కో సీక్వెల్ ఆలోచనను ఓపెన్‌గా ఉంచుకుందని అంటున్నారు. దీనిపై రాజమౌళి సైతం స్పందించాడు.
‘బాహుబలి-3’ చేసే ఆలోచన ఉందా అని అడిగితే.. ”ఈ కథకు తగ్గ మార్కెట్ ఉందనే ఈ సినిమా చేశాం. అలా కాని పక్షంలో ఈ సినిమా ఉండేది కాదు. ఐతే ఎవరికి తెలుసు.. రేప్పొద్దున నన్ను డ్రైవ్ చేసే కథతో మా నాన్న వస్తారేమో. అప్పుడు ముగింపు అనేది ఉండదేమో. ఎప్పుడైనా ఇంకో సినిమా చేసే అవకాశముంది” అంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు రాజమౌళి. అంటే.. ‘బాహుబలి’కి కొనసాగింపుగా విజయేంద్ర ప్రసాద్ మంచి కథతో వస్తే రాజమౌళి ఈ సినిమా చేసే అవకాశాలు లేకపోలేదన్నమాట.
Recent Random Post:

















